Heatwave Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత నెల ఫిబ్రవరిలోనే మెుదలైన ఎండలు మార్చి ప్రారంభంలో మరింత పెరిగాయి. ఈ నెల సగానికి వచ్చే సరికి ఎండల తీవ్రత ఇంకాస్త పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని భారత వాతావరణ విభాగం (IMD).. నగరవాసులను అప్రమత్తం చేసింది. అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
నగరవాసులు జాగ్రత్త
హైదరాబాద్ నగరవాసులు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతారవణ విభాగం (India Meteorological Department) హెచ్చరించింది. హైదరాబాద్ లో గరిష్టంగా 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కాగా నగరంలో అత్యధికంగా గాజులరామారంలో 38.8°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
ఆ ఏరియాల్లో..
ఖైరతాబాద్, గోల్కొండ, ముషీరాబాద్, షేక్ పేట్, నాంపల్లి, బండ్లగూడ, అంబర్ పేట తదితర ఏరియాల్లో ఇప్పటికే 35 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డు అవుతున్నట్లు వివరించింది. అటు చార్మినార్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది.
11 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
మార్చి నెల సగంలోనే తెలంగాణలోని 11 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.7°C నమోదైంది. అదిలాబాద్, కుమురంభీం జిల్లాల్లో 40.6°C రికార్డైనట్లు తెలుస్తోంది. కాగా రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకూ పెగిగే ఛాన్స్ ఉందని తాజాగా ఐఎండీ హెచ్చరించింది.
41-44 డిగ్రీల ఉష్ణోగ్రత
అదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతను ఫేస్ చేయాల్సి రావచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక మున్ముందు పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిళ్లు చలి గాలులు
ఓ వైపు ఎండ, మరోవైడు వడగాల్పులతో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ బారిన సైతం పడుతున్నారు. అయితే పగలుతో పోలిస్తే రాత్రి పూట వాతావరణం చాలా భిన్నంగా ఉంటోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు చల్లటి వాతారవరణం ఉంటోంది. రాత్రి వీస్తున్న చల్లని గాలులతో ప్రజలు కాస్త సాంత్వన పొందుతున్నారు. పగలు వీస్తున్న వడగాల్పుల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే ఉత్తర భారత దేశం నుంచి వచ్చే గాలుల కారణంగా తెల్లవారుజాము, రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఉంటోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
Also Read: Half Day Schools: గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన
ఏపీలో ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం ఏంటో చూపిస్తున్నాడు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాదికి గాను గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ఎండవేడిమి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులను అత్యవసరం అయితే తప్ప మిట్ట మధ్యాహ్నం బయటకు పంపవద్దని సూచిస్తున్నారు.