AP 10th Exams: ఏపీలో ఈ నెల 17వ తేదీ నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సందర్భంగా ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఓ హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ప్రభుత్వ హెచ్చరికను ఉల్లంఘించి ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మీరు పదవ తరగతి విద్యార్థులా.. ఇలాంటి చర్యలకు అస్సలు పాల్పడవద్దు సుమా. ఇంతకు ప్రభుత్వం హెచ్చరించిన ఆ హెచ్చరిక ఏమిటో తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
చీఫ్ సూపరిడెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని, ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే ప్రధాన గేటు వద్దే వాటిని సేకరించి భద్రపరచాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను తప్పనిసరిగా మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
పదవ తరగతి పరీక్షలు జరిగే సమయంలో సోషల్ మీడియా, ఇతర ప్రసారమాధ్యమాల ద్వారా పేపర్ లీకు వంటి వదంతులను ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేపర్ లీక్ వంటి వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల బీఈడీ పరీక్షల నిర్వహణ సమయంలో ఇలాంటి వదంతులు వినిపించాయన్నారు.
రాష్ట్రంలో మొత్తం 3450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 163 సెన్సిటివ్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు మొత్తం 619275 మంది విద్యార్థులు హాజరు కానుండగా, వీరిలో 315697 మంది బాలురు, 303578 మంది బాలికలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోనే కర్నూల్ అనంతపురం ప్రకాశం జిల్లాలలో ఎక్కువ మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారుల వద్ద ఉన్న సమాచారం. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సిఎస్ విజయానంద్ తెలిపారు. 08662974540 నెంబర్ తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, జిల్లాలలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరీక్షల తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు పరీక్షల నిర్వహణ సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పంపించగా, పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఎస్ విజయానంద్ సూచించారు.
Also Read: Holi Dahan 2025: హోలీ రోజు.. ఆ బూడిదతో ఇలా చేస్తే.. మీ ఇంట కనకవర్షమే..
అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. మొత్తం మీద రాష్ట్రస్థాయిలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్పవచ్చు. అయితే పేపర్ లీక్ వంటి వదంతులను ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.