Holi Dahan 2025: హోలీ పర్వదినం రానే వస్తోంది. హోలీ అంటేనే రంగుల హరివిల్లు కనిపించాల్సిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో తెగ సంబరాలు జరుపుకుంటారు. కానీ హోలీ రోజు ఇలా చేస్తే.. మీ కష్టాలు చిటికెలో తొలగిపోతాయట. ఇంతకు హోలీ రోజు ఏం చేయాలో తెలుసుకోండి. కష్టాల కడలి నుండి బయటపడండి.
హోలీ పర్వదినాన్ని ఈ నెల 14న దేశ వ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధానంలో పండగ జరుపుకోవడం ఆనవాయితీ. తెలంగాణలో మాత్రం హోలీకి ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా హోలీ పర్వదినం అంటేనే ప్రతి ఇంటా సంబరమే. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పలు రకాలుగా పండగ జరుపుకుంటారు. కొందరు ఇక్కడ హోలీ పండుగను 9 రోజులు జరుపుకొనే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.
మరికొందరు 3 రోజులు, 2 రోజులు హోలీ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ప్రధానంగా ఆదివాసీలు, లంబాడీలు హోలీ పండుగను ఎంతో పవిత్రదినంగా భావిస్తారు. ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉన్న వారందరూ హోలీ పండుగకు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. అందుకే వీరి నివాస సముదాయాల వద్ద హోలీ సంబరం అధికంగా కనిపిస్తుంది. నాటి పండుగ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ.. పండుగ శోభను మరింత పెంచుతున్నారు తెలంగాణ ప్రజలు. అదేమిటంటే..
హోలీ పండగకు ముందు రోజున కామదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కామదహనాన్ని కాముని పున్నమి అని కూడా సంభోధిస్తారు. ఇక ఈ ప్రత్యేక ఆచార చరిత్రలోకి వెళితే.. పరమశివుడు తన మూడవ కన్నుతో కామదేవుడిని బూడిద చేసిన పురాణంతో కామదహనం ముడిపడి ఉంది. అందుకే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో కామదహనం కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా మారింది.
బూడిదతో ఇలా చేస్తే..
కామదహనం నిర్వహించడానికి ముందుగా స్థానిక ప్రజలు ఒక చోట గుమికూడుతారు. అక్కడ పాత వస్తువులు, కర్రలు, పిడకలను పోగు చేసి అగ్నికి ఆహుతి ఇస్తారు. అంటే వాటినన్నింటినీ దహనం చేస్తారు. దీనినే కామదహనం అంటూ సంభోధిస్తారు. దహనం తర్వాత వచ్చిన బూడిదను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ బూడిదను ఇంటింటికీ పంచడమే కాక, కొంతమంది బొట్టుగా కూడా ధరిస్తారు. అంతేకాదు మరికొందరు ఏడాది పాటు తమ ఇంట్లో ఆ బూడిదను భద్రపరుస్తారు.
Also Read: Miss World Contest in Hyderabad: భాగ్యనగరంలో సరికొత్తగా.. అందాల పోటీలు.. మీరు రెడీనా!
ఈ బూడిద బొట్టుగా ధరిస్తే, ఎటువంటి నరదిష్టి తగలదని ప్రజల విశ్వాసం. అలాగే తమ గృహాల ముందు బూడిదను చల్లితే, ఎటువంటి దుష్టశక్తులు రావని, తమ ఇంట సౌభాగ్యం వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. తమ ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి బూడిదను బొట్టు రూపంలో ధరింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం మీద హోలీ పర్వదినం సంధర్భంగా నిర్వహించే కామదహనం అనే ప్రత్యేక కార్యక్రమం తమ ఇంటి కష్టాలను పారద్రోలుతుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అందుకే కామదహన బూడిదకు అంత ప్రాధాన్యత ఉంది. మీ ఇంట కష్టాల నెలవు ఉంటే, కామదహన బూడిదను స్వీకరించండి అంటున్నారు వేద పండితులు.