రాజీవ్ యువ వికాసం
ఈ నెల 15 నుంచి కొత్త పథకం ప్రారంభం
యువతకు స్వయం ఉపాధి అవసరాలకు
లబ్ధిదారులకు తలా రూ. 3 లక్షల సాయం
రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం
బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటాయింపు
ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
మే 31 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి
జూన్ 2న అర్హులైనవారికి పత్రాల పంపిణీ
త్వరలో అధికారుల నుంచి మార్గదర్శకాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించి రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ నెల 15న లాంఛనంగా ప్రారంభించనున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కొన్ని నిధులతో పాటు బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి ఫండ్స్ ను సర్దుబాటు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది యువతకు తలా రూ. 3 లక్షల చొప్పున సాయాన్ని అందించనున్నది. ప్రస్తుత బడ్జెట్‌లోనే దాదాపు రూ. 6 వేల కోట్లను ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నోటిఫికేషన్ రావడంతోనే వెబ్‌సైట్ అందుబాటులోకి రానున్నది. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 6 వరకు వెసులుబాటు ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మీడియాకు వెల్లడించారు. దరఖాస్తులన్నింటినీ సెలక్షన్ కమిటీ పరిశీలించి మార్గదర్శకాలకు లోబడి ఉన్నవాటిని వడపోసి అర్హులైన లబ్ధిదారులను మే 31వ తేదీకల్లా ఎంపిక చేస్తుందని, వారికి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సాయం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తుందని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద లబ్ధి పొందినవారు ఈ కొత్త పథకానికి అర్హులా.. కాదా.. అనే అంశంపై మార్గదర్శకాల్లో స్పష్టత రానున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అవసరమైన అర్హతలను మార్గదర్శకాల్లో అధికారులు పేర్కొననున్నారు. దరఖాస్తు చేసుకునే సమయానికి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. యువతకు స్వయం ఉపాధి పథకాల ద్వారా సాయాన్ని అందించి అభ్యున్నతికి దోహదపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ్యమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్లను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగా నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అందలేదన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద బ్యాంకు లింకేజీతో 100 శాతం సబ్సిడీ (గ్రాంట్) ఇవ్వనున్నామని, లబ్ధిదారులు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం కలిగే విధంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద బీసీ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ రిలీజ్ అవుతాయని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని సెక్షన్ల యువతకు ఈ స్కీమ్ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి నిర్ణయం తీసుకున్నామని, వచ్చే సంవత్సరం నుంచి అమలుపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
మహిళా వర్శిటీకి రూ. 540 కోట్లు :
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించిందని, సుమారు రూ. 540 కోట్ల ఖర్చుతో పనులను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దేశంలోనే ఉత్తమ యూనివర్శిటీగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ డిజైన్ ఖరారైందన్నారు. ప్రస్తుతం యూనివర్శిటీ ప్రాంగణంలోని వారసత్వ సంపదగా ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరణ చేస్తామన్నారు.
యూనివర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదివైపు ఉన్నప్పటికీ దానిని వాడకుండా మరో ఎంట్రీని వాడుతున్నట్లు గుర్తుచేసిన డిప్యూటీ సీఎం… మూసీ పునరుజ్జీవం అయిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామన్నారు. వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15.5 కోట్లను, నూతన భవన నిర్మాణానికి రూ. 100 కోట్లను తక్షణం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు.