ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
అందులో ప్రస్తావించే అంశాలపైనే ఉత్కంఠ
బాధ్యతలు స్వీకరించాక ఇదే ఫస్ట్ స్పీచ్
మరుసటిరోజు ధన్యవాద తీర్మానంపై చర్చ
ప్రభుత్వాన్ని నిలదీసేలా విపక్షాల వ్యూహం
కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయిన కాంగ్రెస్
సభకు కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులు
నిరసనలు జరగకుండా మూడంచెల భద్రత
రూ. 3.10 లక్షల కోట్లలోపే బడ్జెట్ అంచనా
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం (మార్చి 12) నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఈ సెషన్ మొదలవుతున్నది. గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ప్రసంగం ఇదే. అందులో ‘మై గవర్నమెంట్’ అంటూ ప్రభుత్వంపైన ఎలాంటి ప్రశంసలు కురిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజునే చర్చ జరగనున్నది.
విమర్శలు చేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పథకాల అమలును ఎండగట్టాలంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. స్వయంగా ఆయన కూడా తొలి రోజు సభా కార్యకలాపాలకు హాజరవుతున్నట్లు సంకేతం ఇచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష గురించి గవర్నర్ తన ప్రసంగంలో ఏవైనా అంశాలను ప్రస్తావిస్తే కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ సభ్యులు కూడా సిద్ధమవుతున్నారు.
విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు, గణాంకాల ఆధారంగా ఘాటుగా కౌంటర్ ఇచ్చేందుకు అధికారపక్షం కూడా సన్నద్ధమవుతున్నది. ఈ నెల 29వ తేదీ వరకు సభా సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై ఏ రోజు ఏ బిల్లుపై చర్చ జరగనున్నదీ, సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది ఖరారు చేయనున్నది.
కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వం ఈ సెషన్‌లోనే బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు నిర్వహించకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ వెలుపలా ఎలాంటి ఆందోళనలు జరగకుండా మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటైంది. రైతుభరోసా, మహిళలకు ఇచ్చిన హామీల అమలు, పంటలు ఎండిపోవడం, కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీని నిలువరించలేకపోవడం.. ఇలాంటి అంశాలన్నింటినీ లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి.
రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొత్త స్కీమ్‌లను ప్రారంభించడం, వాటికి కేటాయించే నిధులపై ఎదురుచూపులు మొదలయ్యాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపుపై ఇప్పటికే అదికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నెలకొన్న నేపథ్యంలో పూర్తిస్థాయి గణాంకాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ఆర్థిక రంగంపై గతేడాది శ్వేతపత్రాన్ని సమర్పించగా ఈసారి కాగ్ లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుని గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
గతేడాదితో పోలిస్తే బడ్జెట్ సైజు ఏ మేరకు పెరగనున్నదనే అంచనాలూ మొదలయ్యాయి. సుమారు రూ. 3.05 లక్షల కోట్ల నుంచి రూ. 3.08 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ఉండొచ్చని, గరిష్టంగా రూ. 3.10 లక్షల కోట్లు దాటే అవకాశం లేదన్నది ఆర్థికశాఖ వర్గాల అంచనా. బడ్జెట్‌ను ఈ నెల 17 లేదా 19న ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ బీఏసీ సమావేశంలో స్పష్టత రానున్నది.
Aslo Read: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!