congress mla counter to ktr in phone tapping case row : తన ఫోన్ ట్యాప్ చేయాలని పోలీసులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశాడని సిరిసిల్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్తపై కేటీఆర్ మండిపడ్డారు. పరువునష్టం కింద లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. తనకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ పై కాంగ్రెస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్‌లో మాట్లాడుతూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ ఇంకా రాజదర్బారు భాషలో మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టినా మారడం లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
కేసీఆర్ పోలీసుల రూపంలో ఓ ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం తలదించుకుంటే.. లీగల్ నోటీసులు పంపుతానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ అంటున్నారని వివరించారు. తాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని, అసలు ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? లీగల్ ఫైట్ చేద్దామా? అని పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం అవుతుందని ఫైర్ అయ్యారు. ఈ పని వల్ల తెలంగాణ రాష్ట్ర పరువు పోయిందని, కేటీఆర్‌కు పరువు ఉన్నదా? అసలు పరువు నష్టం దావా వేసే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని అన్నారు.
కేసీఆర్ పదేళ్లు రాజకీయ దురహంకారంతో రాష్ట్రాన్ని పాలించాడని కే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలు, పౌర హక్కులను తూట్లు పొడిచారని, ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పాలించాలని కేసీఆర్ కుటుంబం అనుకున్నదని మండిపడ్డారు. కేటీఆర్ డిఫమేషన్‌కు భయపడేదెవరు? అని అన్నారు. కేటీఆర్ ఏ నోటీసులు ఇచ్చినా సిద్ధం అని పేర్కొన్నారు. పరువు ఉన్నోడే పరువు గురించి మాట్లాడాలని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పరువంతా బజారులో పడిందని అన్నారు. అసలు కేటీఆర్‌కు పరువు ఉన్నదా? అని ప్రశ్నించారు.