MLC Elections: ఏపీ ప్రభుత్వ కూటమిలోని భాజపా పార్టీ (AP BJP) కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ పార్టీ నేత పేరును ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు ఖాళీలు ఏర్పడగా అందులో కూటమిలోని తెలుగు దేశం పార్టీ 3, జనసేన పార్టీ 1, భాజపా 1 చొప్పున పంచుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో జనసేన నుంచి నాగబాబు పేరు ఖరారు కాగా.. భాజపా నుంచి ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు (Somu Veerraju)ను పేరును అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో ఇవాళ పార్టీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సీనియారిటీకే ప్రాధాన్యం
మరోవైపు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు పేర్లను ఆ పార్టీ ఆదివారమే ప్రకటించింది. టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మల పేర్లను ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరితో పాటు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి అవకాశం కల్పించింది. అయితే టీడీపీ, జనసేన అభ్యర్థుల విషయంలో ముందే క్లారిటీ రావడంతో బీజేపీ తరపున ఎవరు నిలబడతారన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు పేర్లు భాజపా పరిశీలనలోకి సైతం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. చివరికీ సీనియర్ అయిన సోము వీర్రాజుకే ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: Mark Carney: ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని చివాట్లు.. ఆయన మామూలోడు కాదు భయ్యా!
ఇవాళే చివరి రోజు
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ (MLC Election Nominations)కు ఇవాళే ఆఖరి రోజు. దీంతో పార్టీ సభ్యుల సమక్షంలో సోము వీర్రాజు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇక సంఖ్యా బలంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఐదుకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలను అలవోకగా సొంతం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా మార్చి 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక సోము వీర్రాజు విషయానికి వస్తే ఆయన 2020 జులై 27 – 2023 జులై 4 మధ్య ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.