మహిళల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం
ప్రమాదాలపై బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం
గతంలో కేసీఆర్ బంధువులకే ఆర్టీసీ బస్సులు లీజ్ కు..
పదినెలల పాలనపై ఏడుపు ఎందుకు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రానికి పదేండ్ల చంద్రగ్రహణం వీడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి(Indira shakthi) కార్యక్రమంలో మాట్లాడారు. ఎస్సెల్బీసీ టన్నెల్ కూలినా, రోడ్డుపై ప్రమాదం జరిగి మనుషులు చనిపోయినా, ఎండలతో పంటలు ఎండినా బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విపత్తువేళ కూడా సంబురాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారికి పది నెలల పాలనపై ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. తమ అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని సూచించారు. గతంలో మహిళా సంఘాల సభ్యులు మండల కేంద్రాలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేశారన్నారు.
కేసీఆర్ బంధువులు, పెట్టుబడిదారులకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల లీజులను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అప్పగించిందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులు లీజుకు ఇస్తున్నాయని, శనివారం 150 ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) ఆర్టీసీకి సంఘాలు అందజేశాయని సీఎం వెల్లడించారు. హైటెక్ సిటీ పక్కన ఇన్పోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థల పక్కన మహిళా సంఘాలకు 150 షాపులు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మహిళా సంఘాలు కార్పొరేట్ సంస్థలతో పోటీపడేలా ప్రోత్సహిస్తామన్నారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలు ఉత్పత్తులకు పన్నుల మినహాయింపుతో పాటు ముడి సరకు కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ తొలి అయిదేళ్లు తన మంత్రివర్గంలో మహిళలను తీసుకోలేదని, ఈ రోజు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్క మహిళల తరఫున నిలబడి కొట్లాడుతున్నారని, మహిళాల పక్షాన మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు.