Posani Krishnamurali : పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్ విధించింది నరసరావుపేట కోర్టు. ఇప్పటికే రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజంపేట సబ్ జైలులోనే ఉన్న పోసానిని ఈ రోజు నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. దాంతో నరసరావుపేట పోలీసులు తాము ముందు కోర్టు అనుమతి తీసుకున్నాం కాబట్టి ఆయన్ను విచారించేందుకు అవకాశం ఇవ్వాలంటూ పీటీ వారెంట్ సమర్పించారు. వీరితో పాటు చాలా స్టేషన్ల పోలీసులు కూడా రాజంపేట సబ్ జైలులో పిటి వారెంట్లు సమర్పించారు.
దాంతో జైలు ఉన్నతాధికారులు చర్చలు జరిపి పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దాంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు. ఈ నెల 13 వరకు ఆయనకు రిమాండ్ విధించింది ధర్మాసనం. అయితే మిగతా పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా పీటీ వారెంట్ తో గుంటూరు జైలుకు వస్తున్నారు. వారు కూడా తమకు పోసానిని అప్పగించాలంటున్నారు. వారికి కూడా పోసానిని అప్పగించుకుంటూ పోతే.. వరుస కోర్టుల రిమాండ్ లతో పోసాని ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. ఇప్పటికే ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు.. ఒక జైలు నుంచి మరో జైలుకు తరలిస్తూనే ఉన్నారు. చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.