Posani Krushnamurali : పోసాని కృష్ణమురళి కోసం ఏపీ పోలీసులు (Ap Police) పోటీ పడే పరిస్థితి వస్తోంది. సినీ నటుడు పోసానిని ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యల కేసుల్లో అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. అయితే పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ 17 జిల్లాల పోలీసులు పోసాని కృష్ణమురళిని తమకు అప్పగించాలని అడుగుతున్నారు. వారంతా కూడా పీటీ వారెంట్లను తీసుకుని రాజంపేట సబ్ జైలులో సమర్పిస్తున్నారు.
మేం కోర్టు అనుమతి తీసుకున్నాం కాబట్టి పోసానిని ముందుకు మాకే అప్పగించండి అంటూ వారు కోరారు. నరసరావు పేట, అనంతపురం, అల్లూరి జిల్లా పోలీసులు ముందు మాకే అప్పగించాలి అంటూ వారెంట్లు అందించారు. ఈ వారెంట్లను జైలు అధికారులు పై అధికారులకు పంపించి ఎవరికి ముందు అప్పగించాలి అనే దానిపై చర్చించారు. చివరకు నరసరావు పేట పోలీసులకు పోసానిని అప్పగించారు. దాంతో నరసరావు పేట పోలీసులు పోసానిని తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మరో పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూస్తుంటే పోసానిని రాష్ట్రం మొత్తం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి.