Vamshi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల కస్టడీ ముగిసింది. దాంతో ఆయన్ను విజయవాడ (vijayawada) కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సెల్ లో ఒంటరిగా ఉంచారని.. తనకు ఆస్తమా ఉందని.. కాబట్టి మరో వ్యక్తిని తనతో పాటు సెల్ లో ఉంచాలంటూ కోరారు. వంశీ విజ్ఞప్తిపై న్యాయమూర్తి కూడా స్పందించారు. వంశీ సెల్ దగ్గర అటెండర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మరో వ్యక్తిని ఉంచేలా ఇన్ చార్జి జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. వంశీ భద్రతను ద్రుష్టిలో పెట్టుకుని ఆయన్ను ఒంటరిగా ఉంచినట్టు వివరించారు. వంశీకి సెల్ దగ్గర అటెండర్ ను నిత్యం అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ వంశీకి ఏదైనా జరిగితే జైలు అధికారులే బాధ్యత వహిస్తారని హెచ్చరించింది. వంశీకి ఎలాంటి మెడికల్ సపోర్టు కావాలన్నా అధికారులు కల్పించాలని చెప్పింది కోర్టు. దాంతో పోలీసులు ఆయన్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.