Ysrcp : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vamshi) కేసులో వైసీపీ ట్రూత్ బాంబ్ పేరుతో వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ (satyavardhan) కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేయలేదని చెబుతూ ఇప్పటికే వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇక తాజాగా సత్యవర్ధన్ కు సంబంధించిన వీడియో ఒకటి బయట పెట్టింది. పోలీసులు చెబుతున్నట్టు ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ కిడ్నాప్ కు గురి కాలేదని వైసీపీ వీడియోను పోస్టు చేసింది.
ఈ కేసులో ఈ రోజు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా వైసీపీ పోస్టు చేసిన వీడియోలో ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ విశాఖపట్నంలోని ఆనందరావు జంక్షన్ లో ఓ బట్టల షాపులో తిరుగుతున్నాడని రాసుకొచ్చింది. ‘ఈ వీడియోలో బ్లూ షర్టు వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్. పోలీసులు కిడ్నాప్ అయ్యాడని చెబుతున్న ఫిబ్రవరి 12వ తేదీన అతను బట్టల షాపులో షాపింగ్ చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే అతను కిడ్నాప్ అయినట్టు ఉందా.. కిడ్నాప్ అయిన వ్యక్తి అంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతాడు. కిడ్నాపర్ల చెరలో ఉన్న వ్యక్తి ఈ షాపులో ఎలా కనిపించాడు. ఇది కూటమి ప్రభుత్వ అవినీతి పాలనకు నిదర్శనం’ అంటూ వైసీపీ రాసుకొచ్చింది. చట్టాలను, వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని ఇందులో వైసీపీ పార్టీ ఆరోపించింది.