Chandreshwara: శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోహీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి (Dr Ravindra Chari) నిర్మించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చంద్రేశ్వర’. అతి త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర నుంచి ‘మహా శివరాత్రి’ (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పాట విడుదల కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆర్కియాలజీ నేపథ్యంలో
పాట విడుదల అనంతరం నిర్మాత డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన ఆజ్ఞతో ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లుగా భావిస్తున్నాను. మా మూవీలో ‘ఈశ్వరా’ అని సాగే పాటను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప గొప్ప దేవాలయాలను చాలా గొప్పగా నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలను ఇందులో చూపిస్తున్నాం. డివోషనల్ టచ్‌తో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. త్వరలోనే మా ‘చంద్రేశ్వర’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని అన్నారు.
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
‘ఛావా’లా సక్సెస్ కావాలి
డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ మాట్లాడుతూ.. నిర్మాత రవీంద్ర చారి చంద్రేశ్వర మూవీతో మన సనాతన ధర్మం, దేవాలయాల నేపథ్యంతో మంచి సినిమా చేస్తున్నారు. ఈశ్వరుడిపై విడుదలైన ఈ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు అంతా మంచే జరగాలని గత వారం ప్రయాగరాజ్ వెళ్లి మరీ పూజ చేసి వచ్చారు. ఆయన ఎప్పుడూ హిందూధర్మం గురించే మాట్లాడుతుంటారు. అలానే ఆయన నాకు కనెక్ట్ అయ్యారు. ఇటీవల ‘ఛావా’ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ ‘చంద్రేశ్వర’ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రవీంద్ర చారి ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

‘చంద్రేశ్వర’ మూవీలోని శివుని పాట రిలీజ్‌తో ఈ శివరాత్రి మాకెంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాం. సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ మా టీమ్‌కు కావాలని అన్నారు కో ప్రొడ్యూసర్స్ పి. సరిత, వి. బాలకృష్ణ. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు అశోక్ కుమార్, గాలిపటాల సుధాకర్, జబర్దస్త్ వినోదిని, జబర్దస్త్ గడ్డం నవీన్, నటి సంజనా చౌదరి వంటి వారంతా మాట్లాడుతూ.. సనాతన ధర్మం, దేవాలయాల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు.