తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్సీపై సీపీఐ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐ పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఎన్నికల అనంతరం రెండు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి హామీ లభించిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో కాంగ్రెస్ సంఖ్యాబలం రీత్యా నాలుగు సీట్లు కైవసం చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు ముఖ్యమంత్రిని ఒకటి రెండురోజుల్లో కలిసే యోచనలో సీపీఐ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. సీఎం నుంచి వచ్చే క్లారిటీ తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారిస్తామని సీపీఐ నేత ఒకరు తెలిపారు. అయితే.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్సీ స్థానాలపై తీవ్ర పోటీ, నేతల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం సైతం ఒక సీటును కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ వినతిని కాంగ్రెస్ ఏ మేరకు పట్టించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సీపీఐ, కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం సీపీఐకి ఒక అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ఒప్పందం జరిగిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తమకు ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఖచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వాదన మరో విధంగా ఉంది. ఒప్పంద సమయంలో ఒక ఎమ్మెల్యే స్థానం, ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించారని అధికారపార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఆశావాహులు?
కాంగ్రెస్ నుంచి హామీ ఎలా ఉన్నా.. ఇప్పటి నుంచే పలువురు సీపీఐ నేతలు ఎమ్మెల్సీ కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇలా పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి.