తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అసలు హైకమాండ్ మదిలో ఎవరు ఉన్నారు? స్టేట్ పార్టీ ఎవరిని సిఫారసు చేసింది? సీఎం మద్దతు ఎవరికి ఉన్నది? అనే అంశాలపై విస్తృతంగా చర్చలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ లభించని నేతలకే ఎమ్మెల్సీలు వరించే చాన్స్ ఎక్కువగా ఉన్నది. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల నుంచి పేర్లు సెలక్ట్ చేయాల్సి వస్తే.. లిస్టు భారీ స్థాయిలో ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఫిల్టర్ చేసే పరిస్థితి కూడా లేదని భావిస్తున్నారు. ఒకరికి కేటాయిస్తే, మిగతా వారి నుంచి అసంతృప్తులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త టెన్షన్‌ను కోరి తెచ్చుకునే అవకాశం లేదని సీనియర్ నేతలు సైతం చెప్తున్నారు.
లిస్టు లోకి కొత్త పేర్లు…?
ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు దాదాపు ఖారరైనట్టు వినిపిస్తున్నది. మరోవైపు మరో రెండు స్థానాల కోసం కొత్తగా మరో మూడు పేర్లు తెర మీదకు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, వైరా నియోజకవర్గానికి చెందిన విజయాబాయి, మేడ్చల్‌కు చెందిన హరివర్ధన్ రెడ్డి పేర్లు కూడా చర్చల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు లభించలేదని, అందుకే వీరిని పరిగణలోకి తీసుకునే చాన్స్ ఉన్నదని అంటున్నారు.
ఆ సీపీఆర్వో ఎవరు?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఓ సీపీఆర్వో కూడా ట్రై చేస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆ సీపీఆర్వో ఎవరనేది పలువురు లీడర్లు, మీడియా సర్కిళ్లలో చర్చంశనీయమైంది. సీఎం సీపీఆర్వోగా అయోధ్య రెడ్డి ఉన్నారు. గాంధీభవన్‌కు సీపీఆర్వోగా హరి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరనేది ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అధికార ప్రతినిధిగా పనిచేసిన అయోధ్య రెడ్డి.. రేవంత్ సీఎం అయిన తర్వాత సీపీఆర్వోగా నియమితులయ్యారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడికి బ్యాక్ గ్రౌండ్‌లో అంతా తానై వ్యవహరించారనే ప్రచారం ఉన్నది. పబ్లిక్‌లో మైలేజ్ వచ్చేందుకు చేయాల్సిన ప్లాన్‌లు, సలహాలు, నాడు బీఆర్ఎస్‌పై ఎదురుదాడి చేసేందుకు ఎంచుకోవాల్సిన అంశాలను సైతం అయోధ్య రెడ్డి సెలక్ట్ చేసేవారనే అభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి అతి నమ్మకమైన వ్యక్తిగా పేరుండటంతో ఆయనకే చాన్స్ ఎక్కువని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గాంధీభవన్ సీపీఆర్వో హరిప్రసాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలకు అతి సన్నిహితంగా ఉంటారనే చర్చ ఉన్నది. చాలా ఏళ్లుగా గాంధీభవన్‌లో సీపీఆర్వోగా పనిచేస్తున్నందున కాంగ్రెస్ నేతలందరినీతోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. రాజకీయాలపై స్పష్టమైన పట్టు ఉన్న హరి ప్రసాద్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం చెందాల్సిన పనిలేదనే చర్చ ఉన్నది. అయితే వీరిద్దరూ ఎక్కడా తాము ట్రై చేస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదు. కానీ వీరిద్దరి సన్నిహితులు మాత్రం ఎమ్మెల్సీ కేటాయిస్తే బాగుండునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.