YSR Cheyutha Scheme Funds : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల మహిళలు శాశ్వత జీవనోపాధిని పొందేలా .. 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడలో సీఎం జగన్ నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేశారు. 26 లక్షల 98 వేల 931 మంది మహిళల ఖాతాల్లో.. ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నేటి నుంచి 14 రోజులలో జమ కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మలను పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ.. అన్నివర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు.
వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు. 58 నెలల సుపరిపాలనలో రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామన్నారు. మహిళా దినోత్సవం ముందురోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ చేయూత పథకానికి రూ.5060 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలలో 1,34,514 మంది మహిళలు గొర్రెలు, మేకల్ని పెంచుతున్నారని, 3,80,466 మంది ఆవులు, గేదెలను కొనుగోలు చేశారన్నారు. మరో 1,68,018 మంది కిరాణా దుకాణాలను నడుపుతున్నారని తెలిపారు.
అమ్మఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వ తమదేనని, పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని సీఎం జగన్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. మహిళల రక్షణకై దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశామని తెలిపారు. 99.83 శాతం రుణాల రికవరీ రేటుతో దేశంలోనే పొదుపు సంఘాలు నంబర్ వన్ స్థానంలో నిలిచాయని తెలిపారు.
గత ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోలేదని సీఎం జగన్ దుయ్యబట్టారు. ఆడపిల్ల పుట్టగానే రూ.25వేలు డిపాజిట్ చేస్తామని .. ఆ పథకానికి మహాలక్ష్మి పేరు పెట్టారు కానీ.. చేయలేదన్నారు. అలాగే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలే గుర్తొస్తాయన్నారు. పవన్ కల్యాణ్ కార్లను మార్చినంత తేలికగా భార్యలను మారుస్తాడని, అతని పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం వస్తుందన్నారు. అమ్మవారిపేరును ఆటవస్తువుగా వాడుతున్నారు. కుటీర లక్ష్మి, మహాలక్ష్మి .. ఇప్పుడు మహాశక్తి అని ఏవేవో పేర్లు పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను నమ్మితే.. మనిషిని తినే పులి తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నట్టే అని విమర్శించారు.