Maoists: తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని దట్టమైన నల్లమల అడవుల్లో సీనియర్ మావోయిస్టు నాయకుల సమావేశం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని అడవి టైగర్ రిజర్వుగా ఉండడంతో ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉంటుందని సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో సంస్థను పునరుద్ధరించడానికి ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నట్లుగా సమాచారం. కొంతమంది నాయకులకు బాధ్యతలను అప్పగించే విషయంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చురుకుగా ఉన్న మావోయిస్టులకు నూతన బాధ్యతలు అప్పగించేందుకు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Maoists Killed: చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు
మావోయిస్టు పార్టీ పటిష్టత
మావోయిస్టు పార్టీలో విభేదిస్తూ కొంతమంది పోలీసుల ఎదుట లొంగిపోతే మరికొంతమంది మావోయిస్టు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం నల్లమలలో జరిగిన సమావేశంలో సీనియర్ మావోయిస్టులకు నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవుజీ ని కేంద్ర కమిటీ అధిపతిగా, హిడ్మాను మిలటరీ కమిషన్ అధిపతిగా, కేసాను బెటాలియన్ కమాండర్ గా, దామోదర్ ను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జిగా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గణేష్ ఓ పోలిట్ బ్యూరో సభ్యుడుగా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొత్త ముఖాలను తెరపైకి
సీనియర్ క్యాడర్ నక్సలైట్లు ప్రస్తుతం బలహీన పడుతున్న నేపథ్యంలో సంస్థ గురించి ఆందోళన పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మావోయిస్టు పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. పాత కమాండర్ల మరణాలతో కొత్త ముఖాలను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిసింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని సీనియర్ మావోయిస్టులంతా లొంగిపోవడంతో వారిని మావోయిస్టు సంస్థ ద్రోహులుగా పేర్కొన్నారు.
22 నెలలు 29 ఎన్కౌంటర్లలో 448 మంది హతం
చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు మావోయిస్టు పార్టీ అంచలంచెలుగా ఎదిగి నేడు క్షీణించే దశకు చేరుకుంది. గత 22 నెలలుగా బస్తర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో గగన్న అలియాస్ బసవరాజు, వికల్ప్, చలపతి, కోసా, బాలకృష్ణ వంటి అగ్రశ్రేణి మావోయిస్టులు హతమయ్యారు. 29 ఎన్కౌంటర్లలో 448 మంది మృతి చెందారు. 2274 మంది లొంగిపోయారు. అయినప్పటికీ మావోయిస్టు కార్యకలాపాలకు అతిపెద్ద మిలిటరీ బెటాలియన్ నెంబర్ వన్ నిలిచిన సంస్థలో ఇంకా 300 మందికి పైగా సాయుధ నక్సలైట్లు చురుకుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హిడ్మా మిలిటరీ నెంబర్ వన్ కు నాయకత్వం వహించాడు. సీసీ సభ్యుడిగా మారిన తర్వాత ఆ స్థానాన్ని దేవా కు అప్పగించారు. ప్రస్తుతం బెటాలియన్ నెంబర్ వన్, నంబర్ టు, నెంబర్ 4, నెంబర్ 5 మిలటరీ బెటాలియన్లు కొనసాగుతున్నాయి.
దక్షిణ బస్తర్ లో ప్రాంతంలో చురుకుగా పనిచేసే హిడ్మా, దేవా లు లొంగిపోవడానికి సిద్ధంగా లేరని ఇటీవల రూపేష్ విడుదల చేసిన ప్రకటన ద్వారా వెళ్లడవుతుంది. కానీ ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం పని చేసే మావోయిస్టులు లొంగిపోయేందుకు కోరుకుంటున్న హిడ్మా, దేవుజి భయం కారణంతో ముందుకు సాహసించలేకపోతున్నారని ఆశన్న తన ప్రకటనలో వెల్లడించారు. నార్త్ బస్తర్ ప్రాంతం నుండి మావోయిస్టు వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని బస్తర్ ఐజి పి సుందర్ రాజ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు సైతం వెల్లడించారు. ప్రస్తుతం మావోయిస్టు చర్యలపై కేంద్ర భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ లను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మావోయిస్టులను మట్టు పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సంసిద్ధులవుతున్నారు. మార్చ్ 31, 2026 మిషన్ 2026 గడువు కంటే ముందే బస్తర్ లో మావోయిస్టు రహిత ప్రాంతంగా చేయడమే కేంద్ర ప్రభుత్వ టార్గెట్ గా పెట్టుకుంది. మావోయిస్టులు లొంగి పోవడమే ఏకైక మార్గమని లేదంటే ఎన్కౌంటర్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Maoists: హింస వద్దు.. ఉపాధే ముద్దు.. వనం నుంచి జనంలోకి మావోయిస్టులు!
