కరీంనగర్ బ్యూరో, స్వేచ్ఛ: కరీంనగర్ జిల్లాలో పలువురు అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) మెమోలు జారీ చేశారు. కేంద్ర మంత్రి పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా వీరికి మెమోలు జారీ అయ్యాయి. ఈనెల 24వ తేదిన కరీంనగర్ లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించిన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీ పథకం కింద పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఖట్టర్ ప్రారంభించారు. ఆయన పర్యటనలో అధికారుల సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి.
Also Read : మా హక్కులను వదులుకోము… తేల్చి చెప్పిన సీఎం రేవంత్
ఏర్పాట్లలో లోపాలు ఉండటంపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాటలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పర్యటనకు విధులు కేటాయించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (టౌన్), ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారి, డీఆర్డీఓలకు మెమోలు జారీ చేశారు. లోపాలపై సంజాయిషీ సమర్పించవలసిందిగా ఆదేశించారు.