Vasireddy Padma Resign : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కీలక, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి మరోషాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారామె.
వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇప్పుడు వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో.. వైసీపీకి షాక్ తగిలినట్లైంది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షానికి వచ్చినపుడు కూడా ఆమె విమర్శలు చేస్తూనే వచ్చారు. అయితే.. ఆమె కేవలం పదవికే రాజీనామా చేశారా ? లేక పార్టీకి కూడా రాజీనామా చేసి.. మరో పార్టీలో చేరుతారా అన్నది తెలియాల్సి ఉంది.
డిగ్రీ వరకూ చదువుకున్న ఆమె.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం విలీనం తర్వాత 2012లో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 ఆగస్టు 8న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించగా.. ఆగస్టు 26న బాధ్యతలు చేపట్టారు.