వెబ్‌సైట్ నుంచి ఫామ్‌ల్యాండ్స్ తొలగింపు
‘స్వేచ్ఛ’ కథనాలకు ముందు జోరుగా వ్యాపారం
ఏపీలో వినుకొండ, వైజాగ్‌లో కొత్త అవతారం
తెలంగాణలో బండారం బయటపడటంతో పరార్
800 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌లో ఎన్ని మోసాలో?
స్వేచ్ఛ- బిగ్ టీవీకి నోటీసులిచ్చి మభ్యపెట్టిన వైనం
మోసాలు వెల్లడికావటంలో తట్టబుట్టా సర్దుకున్న మురళీ కృష్ణ
తప్పు చేయకపోతే.. ఈ దొంక తిరుగుడు ముచ్చట్లు ఎందుకో?
24 గంటలూ అందుబాటులో ఉంటానంటూ.. ఫోన్ స్విచ్చాఫ్
నిలదీస్తున్న వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్న ఘనుడు.
మీ కస్టమర్స్, రెవెన్యూ శాఖ వారితో కలిసి మీ ఫామ్ ల్యాండ్‌కి వెళ్దామా?
స్వేచ్ఛ.. సవాల్‌కి నీమ్స్‌బోరా సిద్ధమేనా?
మోసగాళ్లు – అవినీతి అధికారులకు సింహస్వప్నం స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ ?
పార్ట్ – 4
(దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809, ఇన్వెస్టిగేషన్ ఎడిటర్)
స్వేచ్ఛ, హైదరాబాద్: సరిగ్గా అనుకున్నదే అయింది. ఇన్నాళ్లుగా నీమ్స్ బోరో చెబుతున్నవన్నీ ఒట్టిమాటలేనని స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్‌లో స్పష్టంగా తేలిపోయింది. సొంత భూమి లేదు. చూపించే భూమికి పత్రాల్లేవు. కానీ, జనం సొమ్ము మాత్రం నీమ్స్‌బోరో ఖజానాకు చేరిపోయింది. ‘నీమ్స్‌బోరో పేరు మీదనే రసీదు’ అంటూ ఇన్నాళ్లుగా అమాయకులను మభ్యపెట్టి ఎకరం రూ. 40 లక్షలకు అమ్మేసి, తర్వాత ఏదైనా సమస్య వస్తే నాకేం సంబంధం లేదని దులుపుకుపోయిన కేటుగాడి బాగోతం బట్టబయలైపోయింది. ‘ఇవన్నీ మన కంపెనీ భూములే’ అని చెబుతూ వ్యాపారం చేస్తున్న ఈ మాయగాడికి వాటిపై ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని తేటతెల్లమైపోయింది. ‘ఏంటి సంగతి’ అంటూ ఈ మయాగాడిని ఆరా తీస్తున్న మీడియా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రశ్నలకు ఏం చెప్పాలో తోచక ‘ఏడాదిన్నరగా అన్ని అనుమతులతోనే వ్యాపారం చేస్తున్నా.. రెరా, డీటీసీపీ లే-అవుట్ అనుమతులు ఉన్నాయిగా’ అంటూ వాట్సప్ పోస్టులు పెడుతూ ఇంకా బుకాయించే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇన్నాళ్లు వేల ఎకరాలంటూ దర్జాగా ఊదరగొట్టి స్వేచ్ఛ కథనాలకు వెన్నులో వణుకు పుట్టటంతో ఇన్నాళ్లుగా తాను చేసిన రూ. 500 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ తాలూకూ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో నుంచి తీసేశాడు.
ఏపీకి పరారు..?
ఊహించని రీతిలో అన్ని ఆధారాలతో స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన వరుస కథనాలు, తెలంగాణలో రియల్ ఎస్టేట్ మందగించిందనే ఉద్దేశంతో ఎప్పటికైనా తాను ఇక్కడ దొరికితే కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుందని స్పష్టంగా అర్థం కావటంతో నీమ్స్ బోరో ఎండీ వెంకటనాగ మురళీకృష్ణ ఆంధ్రలో సెటిలయ్యేందుకు పెట్టేబేడా సర్దుకుంటున్నాడు. అక్కడ వినుకొండ, వైజాగ్‌కి 30 కి.మీ సమీపంలో ఫామ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ మధ్యవర్తులతో బిజినెస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ఆఫీస్‌లోని సిబ్బందినీ తగ్గిస్తూ పోతున్నారు.
స్వేచ్ఛ సవాలును స్వీకరించే దమ్ముందా?
అమాయకులను పీడిస్తున్న అవినీతి అధికారుల పట్ల, మధ్యతరగతి కష్టార్జితాన్ని దోచుకుతింటున్న రియల్ ఎస్టేట్ కేటుగాళ్ల మోసాలతీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ ఎడిటర్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉంటారు. ఈ విషయంలో మేం చెప్పిన, చూపిన ఆధారాలు, వాస్తవాల్లో ఒక్కటైనా తప్పని మీరు భావిస్తే, ఇప్పడే నేరుగా స్వేచ్ఛ సవాలును స్వీకరించొచ్చు. అందుకు మేం రెడీగా ఉన్నాం. మీరూ రెడీ అయితే.. మీ 800 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌లో ఏ సైట్ కైనా రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకొని వచ్చి, మీరు అమ్మిన భూములు, వాటికి మీరు ఇచ్చిన రసీదులు, చేయించిన రిజిస్ట్రేషన్లు పరిశీలిద్దాం. మీకు మధ్యవర్తులుగా పరిచేసిన వారు, మీ బినామీల వివరాలూ మా వద్ద భద్రంగా ఉన్నాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు.. మేమే టీంతో రావటానికి రెడీ. అవసరమైతే రెవెన్యూ, పోలీసు అధికారులనూ పిలుద్దాం.
నేతల మద్దతుకై చర్చలు..
ఇన్నాళ్లూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గులాబీ నోట్లు ముట్టజెప్పి పబ్బం గడుపుకున్న మురళీకృష్ణ, తన మోసాలను కప్పిపుచ్చుకోవటం కోసం ఇప్పుడు ఏ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారో మరో కథనంలో చూద్దాం.