Jogipet News: గ్రామ పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లోని యువతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రెండవ విడుతగా జరగనున్న ఎన్నికల కోసం ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, అభ్యర్థులు తమ బలాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జోగిపేట(Jogipet) మండలంలో నామినేషన్ల స్వీకరణ కోసం ఆరు క్లస్టర్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాడ్మన్నూర్ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ మద్దతుదారుడు పట్లోళ్ల వీరారెడ్డి (నాని) నామినేషన్ దాఖలు చేసిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది.
గుర్రంపై కూర్చొని..
ఆయన రెండు గుర్రాలను తెప్పించి, వాటిలో ఒక గుర్రంపై కూర్చొని తాడ్మన్నూర్ నుంచి అక్సాన్‌పల్లిలోని క్లస్టర్ వరకు వందల సంఖ్యలో తన మద్దతుదారులతో ఊరేగింపుగా వచ్చారు. అభిమానులు వీరారెడ్డి(Veera Reddy)కి గజమాల వేసి, వాహనంపై భారీ ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడంతో.. ఈ దృశ్యం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపించింది.
Also Read: Gadwal District: కొత్త వైన్స్ కు పంచాయతీ కిక్క.. ఈ నెల మొత్తం ఎన్నికల మయం!
బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో..
అదేవిధంగా, అల్మాయిపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్(BRS) పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ రవిశంకర్ కూడా వందల సంఖ్యలో తన మద్దతుదారులను వెంటబెట్టుకొని జోగిపేటలోని ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. కాగా, అందోలు మండలంలో తొలిరోజు మొత్తం 25 పంచాయతీ స్థానాలకుగాను నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మండలంలో సర్పంచ్ స్థానానికి 19 మంది, వార్డు మెంబర్ల స్థానానికి 45 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
Also Read: Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు
