MLC Kavitha: గోప్యంగా ఉంచాల్సిన లేఖను బయటపెట్టారు. ఆ బయటపెట్టిన వ్యక్తిని పట్టుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి పది రోజులు గడిచింది. అయినా ఈ లీకుడెవరు అనేది తేల్చలేదు. కావాలని పార్టీ అధిష్టానం పట్టుకోవడం లేదా? లేకుంటే ఆ లేఖను లైట్ గా తీసుకొని వదిలేశారా? అనేది చర్చకు దారితీసింది. లేకుంటే కవితనే పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నారా? అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఫాం హౌజ్ లోనే జరిగిన లీకువీరులను పట్టుకోకపోకపోతే భవిష్యత్ లో కష్టమేనని ఇది పార్టీకి నష్టం చేకూర్చుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
కవిత లేఖను ఎవరికి ఇచ్చారు
ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ గత నెల 22న బయటకు వచ్చింది. లేఖలోని అంశాలు వైరల్ అయ్యాయి. పార్టీలోనే కొంతమంది కోవర్టులు ఉన్నారని, గోప్యంగా రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు. అయినప్పటికీ 10 రోజులు గడిచింది. ఇప్పటికీ లేఖను ఎవరు బయటకు లీకు చేశారు. ఎవరు ఫొటోలు తీసి రిలీజ్ చేశారనేది ఇప్పటికీ గోప్యమే. ఫాం హౌజ్ లో కేవలం కొంతమంది మాత్రమే కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటారు. కేసీఆర్ ను నేతలు కలిసేందుకు వెళ్తే అలా వెళ్లి వెంటనే తిరుగు పయనమవుతారు. ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఈ తరుణంలో కవిత లేఖ లీకు కావడం హాట్ టాపిక్ అయింది. ఎవరో కేసీఆర్ కు సన్నిహితులు అయితే తప్ప ఆ లేఖను లీకు చేయడానికి అవకాశం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు కవిత లేఖను ఎవరికి ఇచ్చారు? నేరుగా కేసీఆర్ కు ఇచ్చారా? లేకుంటే మధ్యవర్తికి ఇచ్చారా? అనేది కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు కవిత లేఖను తనతల్లి శోభమ్మకు ఇచ్చిందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఆమె మరోవ్యక్తికి ఇచ్చిందని ఆ వ్యక్తే లీకు చేశారనే ప్రచారం జరిగింది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు పేరును బయట పెట్టడం లేదు అనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.
Also Read: GHMC Council: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్.. వాడీవే‘ఢీ’గా జరగనుందా?
లేఖను కావాలని బయటపెట్టారు
ఫాం హౌజ్ లో కేసీఆర్ తో పాటు కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ఎంపీలు ఉంటున్నారు. అయితే వారిలో అత్యంత సన్నిహితులు ఉన్నారు. వారితో కొన్ని కుటుంబ విషయాలు సైతం చర్చిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో కవిత రాసిన లేఖను కేసీఆర్ చదవి చించకుండా ఇవ్వడంతోనే ఆ లేఖను కావాలని బయటపెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఈ లేఖ లీకుపై కవిత సైతం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, ఆ లీకు వీరులెవరో బయటపెట్టాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ రోజులు గడుస్తున్నాయి కానీ లీకు చేసిన ఈ లీకువీరుడిని మాత్రం గుర్తించకపోవడంతో పార్టీ శైలీని సైతం నాయకులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ లో పార్టీ అంతర్గతంగా చర్చించే అంశాలు సైతం ఇతర పార్టీలకు లీకు అయితే పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? రాబోయే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తారనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. ఇంట్లో ఉన్న లీకు వీరులను గుర్తించకపోతే రాష్ట్రంలో ప్రజలకు భవిష్యత్ లో ఏం సమాధానం చెబుతారనేది కూడా నేతలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలకు ఇప్పటికే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అయింది.
కేటీఆర్ లీకు వీరులను పట్టుకోక పోవడం
కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని ఈ నెల 5న హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతనైనా లేఖను లీక్ చేసిన వ్యక్తిని గుర్తిస్తారా? లేదా? అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. కవిత మాత్రం పరోక్షంగా పార్టీ నేతల తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తుండటంతో ఆయనకు సైతం ఈ లీకు వీరులను పట్టుకోవడం ఆయన సమర్థతకు గీటురాయిగా మారనుంది. లేకుంటే కవిత లేఖను పట్టించుకోకుండా పార్టీపై దృష్టిసారించడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యాచరణపై నేతలతోనూ సమావేశాలు, సభ్యత్వ నమోదు అంశాలపై దృష్ఠికేంద్రీకరిస్తారా? అనేది సైతం చర్చకు దారితీసింది. ఏది ఏమైనా పార్టీని ఓ కుదుపు కుదిపిన లేఖ వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? లేకుంటే పట్టుపట్టనట్లు వ్యవహరిస్తారా? లేఖ పెద్ద విషయమే కాదన్నట్లు వదిలేస్తారా? అనేది చూడాలి. పార్టీ నేతలు సైతం ఆసక్తిగా పార్టీ నిర్ణయంపై ఎదురుచూస్తున్నారు.
Also Read: IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!