Indian Soldier: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. భారత్ చర్యకు తప్పకుండా ప్రతి చర్య ఉంటుందని పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ అన్నారు. కచ్చితంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెలవుల్లో ఉన్న ఆర్మీ జవాన్లు వెంటనే సరిహద్దులకు వచ్చి విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వరంగల్ కు చెందిన సైనికులు సరిహద్దు బాట పట్టారు. ఈ క్రమంలోవారికి అనుకోని కష్టం వచ్చింది.
సీట్లు దొరక్క అవస్థలు
వరంగల్ నుంచి దేశ సరిహద్దుల బాట పట్టిన సైనికులకు అనుకోని కష్టం వచ్చి పడింది. రైలు ప్రయాణం కోసం బెర్త్ కన్ఫామ్ కాక ఆర్మీ జవాన్లు అవస్థలు పడుతున్నారు. వరంగల్ నుంచి సుదూర ప్రాంతాలైన ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్ లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. దేశం నలుమూల నుంచి తిరిగి ఉద్యోగంలో చేరుతున్న సైనికులకు ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ అవసరమున్న దృష్ట్యా రైళ్లల్లో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని సైనికులు కోరుతున్నారు. రైల్వేశాఖ దృష్టి సారించి రిజర్వేషన్లలో ఆర్మీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కష్టకాలంలో అండగా నిలుద్దాం
మరోవైపు రైళ్లలో జవాన్ల ప్రయాణికి సంబంధించి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుస్తోంది. కష్టకాలంలో అండగా ఉండేందుకు వెళ్తున్న సైనికులకు రైల్వే ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ బోగిలో ఎవరైనా ఆర్మీ జవాన్ నిలబడి కనిపిస్తే వెంటనే వారికి సీటు ఇచ్చి అండగా నిలవాలని సూచిస్తున్నారు. జవాన్లు అనారోగ్యానికి గురికాకుండా ఉండటం ఈ సమయంలో అత్యవసరమని పేర్కొంటున్నారు.
Also Read: IND Neutralizes PAK Missile: బరితెగించిన పాక్.. భారత్ పైకి మిసైళ్లు.. బుద్ధిచెప్పిన సైన్యం!
కేంద్రం కీలక ఉత్తర్వులు
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) అనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెంటనే వెనక్కి రప్పించాలని పారా మిలటరీ బలగాల చీఫ్ లను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి. దేశ భద్రత విషయంలో ఆర్మీ ఉన్నతాధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించారు.