Uttam Kumar Reddy: నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్‌ఎస్
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే పీఆర్‌ఎల్‌ఐసీ నీటి సామర్థ్యాన్ని 1 టీఎంసీలకు కుదింపు
ఆంధ్రప్రదేశ్‌తో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణా ప్రయోజనాలను తాకట్టు
కృష్ణా జలాశయాలలో 763 టీఎంసీలు తెలంగాణాకు కేటాయించాల్సిందే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు?
పీఆర్‌ఎల్‌ఐ 90 శాతం పూర్తి అయిందనడం వాస్తవం కాదు
ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 80 వేల కోట్ల పైచిలుకు వ్యయం అవుతుంది
2015లో ఈ ప్రాజెక్టును పూర్తికి 35 వేల కోట్లతో అంచనా వేశారు
2022లో సీడబ్య్లుసీకి ఇచ్చిన డీపీఆర్‌లో భూసేకరణ, కాలువల నిర్మాణం లేకుండానే 55 వేల కోట్లకు పెంచారు
కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురి
నదీ జలాల అంశంపై బి.ఆర్.ఎస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం
మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నదీ జలాశయాలలో తెలంగాణా రాష్ట్రానికి మరణశాసనమే బీఆర్ఎస్ ప్రభుత్వం రాసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌తో, తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలయ్-బలయ్ చేసుకుని రాష్ట్ర నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి సామర్ధ్యాన్ని ఒక్క టీఎంసీకి కుదించారని ఆయన మండిపడ్డారు. ప్రజాభవన్‌లో గురువారం నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆధారాలతో సహా సోదాహరణంగా ఉత్తమ్ వివరించారు. కృష్ణా జలాశయాలలో 763 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌లో స్వయంగా తాను పాల్గొని రాష్ట్రం తరపున గట్టి వాదనలు వినిపిస్తున్నామని, అంతిమంగా విజయం తమకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం కు ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు.జూరాల వద్ద నీటి లభ్యత ఉన్నప్పుడు శ్రీశైలంకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు.బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు చెబుతున్నట్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం 90% ,పూర్తి అయిందనడం సత్యదూరమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే 80 వేల కోట్ల పై చిలుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అందుకు బి.ఆర్.ఎస్ పాలకులు అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల రంగం పట్ల చూపిన నిర్లక్ష్యమే కారణమన్నారు.
Read Also- Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?
2015లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 35 వేల కోట్లు అంచనా వేశారని ఆయన గుర్తుచేశారు.2022 లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గాను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి సమర్పించిన డి.పి.ఆర్ లో 55 వేల కోట్లు అవుతుందని ఇచ్చిన రిపోర్ట్ ను ఆయన గుర్తుచేశారు. ఇందులో భూసేకరణ తో పాటు కాలువల నిర్మాణం పొందు పరచ లేదన్నారు. పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఖర్చు పెట్టింది కేవలం 27 వేలు కోట్లు మాత్రమే నని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే 7 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2013 ఆగస్టులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పీఆర్‌ఎల్‌ఐసీ ప్రాజెక్టును రాష్ట్ర విభజనకు ముందు ఉన్న పాత ప్రాజెక్టు గా పరిగణనలోకి తీసుకుని ఉంటే ట్రిబ్యునల్ లో నీటి ప్రాధాన్యత దక్కి ఉండేదన్నారు. జూరాల వద్ద కొనసాగితే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని,రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతటి భారం పడేది కాదని ఆయన పేర్కొన్నారు. దానికి తోడు ఇక్కడే యధావిధిగా కోనసాగి ఉంటే అనుమతుల పేరుతో ఆలస్యం జరిగి ఉండేది కాదన్నారు. జీవో నెంబర్ 34 ప్రకారం జూరాల నుంచి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ పద్దతిలో నీటి నిల్వలకు ట్రిబ్యునల్ అంగీకారం ఉన్నందున ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి అయ్యి ఉండేది కాదన్నారు.
Read Also- Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.నదీ జలాశయాలలో తెలంగాణా నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధులై పని చేస్తుందని ఆయన చెప్పారు.కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్న సమర్ధవంతమైన వాదనల పై ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖ నే నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను నిరూపిస్తుందని ఆయన చెప్పారు.కృష్ణా జలాశయాల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణాకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.బ్రిజేష్ కుమార్ కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు మరో 8 నేలలో వచ్చే అవకాశం ఉందన్నారు.అంతర్ రాష్ట్ర జలాల వివాదంలో సెక్షన్-3 తెలంగాణా రాష్ట్రానికి బలం చేకూరనుందన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురికావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల రైతాంగం నష్ట పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మంత్రి ఉత్తమ్ మడిపడ్డారు.

