Telangana Women Died: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘన, భావనగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన పులఖండం మేఘనా రాణి (25), ముల్కనూరు ప్రాంతానికి చెందిన కడియా భావన (24) ఉన్నత చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో ఎమ్మెస్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో విషాధాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే?
ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్లాలని మేఘన, భావన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మెుత్తం 8 మంది స్నేహితులతో కలిసి రెండు కార్లలో షికారుకు బయలుదేరారు. టూర్ లో ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసిన ఇద్దరు యువతులకు తిరుగు ప్రయాణంలో ఊహించని షాక్ తగిలింది. ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో మృత్యుఒడిలోకి జారుకున్నారు. మేఘనా, భావన ప్రయాణిస్తున్న కారు.. అలబాబా హిల్స్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. మలుపు వద్ద ఉన్న లోయలోకి అమాంతం దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు స్పష్టం చేశారు.
కుటుంబాల్లో విషాధ ఛాయలు
భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కుమార్తెల మృతి విషయం తెలిసి.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. చేతికి అందొచ్చిన కుమార్తెలు.. ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మేఘనా తండ్రి నాగేశ్వరరావు.. గార్ల గ్రామంలో మీ సేవా సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. భావన.. మూల్కనూర్ ఉపసర్పంచ్ కోటీశ్వరరావు కుమార్తె అని సమాచారం. ప్రస్తుతం వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని.. తమ కుమార్తెల మృతదేహాలను గ్రామానికి రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Also Read: Naa Anveshana: అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలి.. నా అన్వేష్
ఈ ఏడాది అక్టోబర్‌లోనూ..
అమెరికాలోని షికాగోలో ఈ ఏడాది అక్టోబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల ప్రాంతానికి చెందిన తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి కార్మికుడు విఘ్నేష్, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అక్టోబర్ 11న చిన్నకుమార్తె తేజస్వి గృహ ప్రవేశం కార్యక్రమానికి విఘ్నేష్ దంపతులు వెళ్లారు. పని నిమిత్తం వారు ముగ్గురు కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరగింది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మృతి చెందారు.

