Tummala Nageswara Rao: చీడ పీడ లను ముందే గుర్తించి ఎర్లీ వార్నింగ్ సిస్టంతో రైతులను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఈఏడాది చేపట్టబోయే వివిధ పథకాలలో సాంకేతికత వినియోగించే దిశగా వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటలలో చీడపీడలను ముందుగానే గుర్తించి, రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంటనష్టంపై త్వరితగతిన అంచనావేయాలన్నారు.
పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనావేయడం, నమోదైన సాగువిస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సరిపోల్చడం, ఇలా ప్రతీ అంశములోనూ ఏఐ ని వాడుకొనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఆ దిశగా సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకొనే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా భాగస్వాములను చేస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆయా కంపెనీలు సాంకేతిక సామర్థ్యం, అమలు తీరు మరియు అవసరమయ్యే నిధులు, రైతులకు కలిగే ప్రయోజనం గురించి డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. అనంతరం ఇక్రిశాట్ , అగ్రివాస్ కంపెనీ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలలో సాంకేతికతను వినియోగించి వారు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. దిగుబడుల అంచనా, సర్వేనెంబర్ వారీగా సాగైన విస్తీర్ణం పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు.
స్వేచ్ఛ E -పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/