తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీల మనోభావాలు దెబ్బతినేలా కుల గణన నివేదికను తగలబెట్టినందుకు TPCC క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందినట్లు కమిటీ తెలిపింది. ఏఐసీసీ అగ్రనేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలం మీడియాలో ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టీ మీరు మీ వ్యక్తిగత ఎజెండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ చీవాట్లు పెట్టింది.
కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిందని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) మర్చిపోయారని TPCC క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో అంటే ఫిబ్రవరి 12లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని మల్లన్నకు డెడ్ లైన్ ఇచ్చింది. కాంగ్రెస్ రాజ్యాంగం నిబంధనల మేరకు వివరణ రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది.