Maoist Leader Sujatha Surrenders: పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సుజాత లొంగుబాటు!43 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పని చేసిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి ఎలియాస్ కల్పన ఎలియాస్ మైనాబాయి, ఎలియాస్ మైనక్క, ఎలియాస్ సుజాత డీజీపీ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. 62 ఏళ్ల వయసున్న పద్మావతి ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన డీజీపీ డాక్టర్ జితేందర్ ఆమెను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని చెప్పారు.
ఆ పార్టీలో కొనసాగుతున్న మిగితా వారు కూడా లొంగి పోవాలని సూచించారు. వారికి పునరావాసం కల్పించటంతోపాటు అన్ని రకాల సహాయాన్ని అందచేస్తామని చెప్పారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచికల్నాడు గ్రామానికి చెందిన పద్మావతి గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నపుడు ఆమె మేనబావ పటేల్ సుధాకర్ రెడ్డి పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టు డీజీపీ చెప్పారు.
Also Read: Huzurabad Heavy Rains: హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం.. లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం
మరో మేనబావ పోతుల సుదర్శన్ రెడ్డి నల్లమల ప్రాంతంలో కృష్ణానదిలో మునిగిపోయి మరణించాడన్నారు. వారి ప్రభావంతోనే 1982లో పద్మావతి అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూప్ గా ఉన్న మావోయిస్టు పార్టీలో చేరినట్టు చెప్పారు. కొంతకాలం జన నాట్య మండలిలో గద్దర్ తో కలిసి పని చేసినట్టు తెలిపారు. పార్టీలో ఉన్నపుడు పరిచయమైన మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్ జీని 1984లో వివాహం చేసుకున్నట్టు చెప్పారు. పద్మావతికి ఓ కూతురు ఉన్నట్టుత తెలిపారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన పద్మావతి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉందన్నారు. మే నెలలో ఆరోగ్యం క్షీణించటంతో సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న ద్వారా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఇచ్చిందన్నారు. ఇప్పటికే పద్మావతిపై 25 లక్షల రివార్డు ఉందని చెప్పిన డీజీపీ ఆ మొత్తాన్ని ఆమెకు అందచేస్తామని చెప్పారు. పునరావాసం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తామని తెలిపారు. పద్మావతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ పోలీసులు అవలంభించిన సమగ్ర వ్యూహ నైతిక విజయమన్నారు.
ఈ ఏడాదిలో 404మంది...
ఈ ఒక్క సంవత్సరంలోనే 404మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు డీజీపీ చెప్పారు. వీరిలో 4గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒకరు డివిజనల్ కమిటీ కార్యదర్శి, 8మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34మంది ఏరియా కమిటీల సభ్యులు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో 78మంది మావోయిస్టు పార్టీలో ఉన్నరన్నారు. 15మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నట్టు చెప్పారు. వీళ్లంతా జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. పోరు వద్దు…ఊరు ముద్దు అన్న పిలుపును గుర్తు చేశారు.
Also Read:GHMC: బల్దియాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. అదేంటంటే..?