Sravan Rao: ఛీటింగ్ కేసులో అరెస్టయిన శ్రవణ్ రావును సీసీఎస్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ముడి ఇనుప ఖనిజం డీల్పేర మోసం చేసి వసూలు చేసిన 6.58 కోట్ల రూపాయలను ఏయే కంపెనీలకు మళ్లించారు? అన్నదానిపై ప్రశ్నించారు. టన్నుకు 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తానని చెప్పి తమ కంపెనీ నుంచి 6.58 కోట్ల రూపాయలకు పైగా తీసుకుని శ్రవణ్ రావు మోసం చేశాడంటూ ఇటీవల అఖండ ఇన్ఫ్రాటెక్ కంపెనీ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ సీసీఎస్పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితునిగా చేర్చగానే శ్రవణ్‌రావు విదేశాలకు పారిపోయాడని ఆకర్ష్కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంప్రదించటానికి ఎన్నిమార్లు ప్రయత్నించినా శ్రవణ్ రావు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్పోలీసులు శ్రవణ్‌రావుతోపాటు అతని భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వాములు ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిలపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 13న శ్రవణ్ రావును అరెస్ట్‌చేశారు. కాగా, ఈ కేసులో మరిన్ని అంశాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ శ్రవణ్‌రావును అయిదు రోజులపాటు కస్టడీకి అనుమతించాలని ఇటీవల సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఒక్క రోజు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీసీఎస్ అధికారుల బృందం చెంచల్‌గూడ జైలుకు వెళ్లి శ్రవణ్‌రావును కస్టడీకి తీసుకుంది. అనంతరం వైద్య పరీక్షలు జరిపించి సీసీఎస్ కు తీసుకొచ్చింది.
Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చెంచల్ గూడ జైలుకు తరలింపు
ఇనుప ముడి ఖనిజం డీల్ పేర ఆకర్ష్ కృష్ణ నుంచి తీసుకున్న 6.58 కోట్ల రూపాయల విషయమై సీసీఎస్ అధికారులు శ్రవణ్ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఈ డబ్బును ఏదైనా కంపెనీలకు మళ్లించారా? అని అడిగినట్టు సమాచారం. శ్రవణ్ రావుకు ఏయే బ్యాంకుల్లో ఖాతాలున్నాయి? అని అడగటంతోపాటు వాటి లావాదేవీల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, ఈ వ్యవహారంలో స్వాతి రావు, ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిల పాత్ర గురించి అడిగినట్టు తెలియవచ్చింది.
కర్ణాటక సండూర్‌లో ఉన్న ఓ కంపెనీ పేర డబ్బు తీసుకున్న నేపథ్యంలో ఆ కంపెనీతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధంపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. కాగా, శ్రవణ్ రావు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదని తెలిసింది. కోర్టు ఇచ్చిన గడువు సాయంత్రానికి ముగియటంతో మరోసారి శ్రవణ్ రావుకు వైద్య పరీక్షలు జరిపించిన సీసీఎస్ అధికారులు ఆ తరువాత కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్ రావు భార్య స్వాతి రావు, ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిల అరెస్టుకు సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలియవచ్చింది.
Also Read: Kamal Haasan: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇది నా ప్రామిస్!