తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Smita Sabharwal: తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సభర్వాల్ అన్నారు. స్వాగత ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్మితా సభర్వాల్ మాట్లాడుతూ ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారని, మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు.
చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుందని వెల్లడించారు. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. 120 మంది మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: స్లాట్ బుకింగ్ ఇక సులువు..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉంటాయి.
ఈ సమీక్షలో టూరిజం డైరెక్టర్ హనుమంతు, డైరెక్టర్ యూత్ సర్వీసెస్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, సెట్విన్ ఎండీ వేణుగోపాల్, టూరిజం, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/