తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TG Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నాంపల్లి కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రాక్టికల్ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయో కంట్రోల్ రూం నుంచే పర్యవేక్షించనుంది. ప్రైవేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో నాలుగు దశల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2008 ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొదటి దశగా 850 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయకున్నా మార్కులు వేస్తున్నారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల పేపర్ లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు అని బోర్డు భావిస్తోంది.