Sarasvati Pushkaralu: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సరస్వతీ పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నెల 15 నుంచి 26 వరకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. నదిలో పుణ్య స్నానాలు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.35 కోట్ల మంజూరు చేసింది. ఈ నిధులతో కాళేశ్వరంలో సైతం వివిధ పనులు చేపడుతున్నారు. ఇవి తుదిదశకు చేరాయి. జ్ఞాన సరస్వతీ ఘాట్ నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి.
పుష్కర ఘాట్ పొడవు 86 మీటర్ల మేర ఉండగా.. మెట్లపై గ్రానైట్, సుందరీకరణ పనులు చేస్తున్నారు. మెట్ల కింది భాగంలో భక్తులకు స్వాగతం తెలుపుతున్నట్లు వివిధ చిత్రాలను వేయిస్తున్నారు. సరస్వతీ విగ్రహం, జ్ఞాన దీపం మధ్య ఏడు హారతుల వేదికలు నిర్మించారు. ఏడుగురు పండితులు కాశీ నుంచి రానున్నారని, వారంతా ఒకేసారి హారతి ఇచ్చేలా ఏర్పాట్లను అధికారులు చేశారు. రూ.కోటి ఖర్చుతో సరస్వతీ విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో తయారు చేసి తీసుకొచ్చారు.
Also Read: Maoists Letter: నక్సల్స్ సంచలన లేఖ.. 6 నెలలు సైలెంట్.. ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడ్డట్లే?
ఇది 24 టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తులో ఉన్న సరస్వతీ దేవి విగ్రహం ఒక చేతిలో రుద్రాక్ష, మరో చేతిలో తాళపత్ర గ్రంథాలు, మరో రెండు చేతుల మధ్య వీణను వాయిస్తున్నట్లు అమ్మవారి రూపం కనిపిస్తోంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరించనున్నట్లు సమాచారం.సీఎం కోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరానికి నిత్యం ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. జ్ఞాన సరస్వతీ ఘాట్ వద్ద 30 కాటేజీలు ఏర్పాటు చేశారు. రెస్ట్ తీసుకునే భక్తులకు రోజుకు రూ.3వేల ధరగా నిర్ణయించారు.
ప్రత్యేక అధికారుల నియామకం ఉత్తర్వులు జారీ
సరస్వతీ పుష్కరాల పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షణ కోసం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. నలుగురు డీపీఓలు, నలుగురు డీఎల్పీవోలు, 14 మంది ఎంపీడీవోలు, 28 మంది ఎంపీఓలు మొత్తం 50 మంది అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ అధికారులంతా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సరస్వతి పుష్కరాల్లో ఎక్కడ ఎలాంటి పారిశుధ్య లోపం తలెత్తకుండా కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేయనున్నారు.
Also Read: Jawan Murali Naik: జమ్మూలో తెలుగు జవాన్ వీరమరణం.. ప్రముఖుల నివాళి