TG Engineering Colleges: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీ(Engineering College)ల్లో ఫీజుల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫీజుల పెంపునకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల హాజరు వంటి పలు నిబంధనలను పరిగణనలోకి తీసుకోనుంది. దీంతో ఫీజు పెంచాలనుకునే యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో నాణ్యత పెరిగే అవకాశాలున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల(Engineering College)కే ఫీజు పెంచుకునే ఛాన్స్‌ను కల్పించిన సర్కార్ అందుకు నిబంధనలు ప్రకటించింది. కళాశాలలు అందించే అకౌంట్స్‌తో పాటు విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులు నిర్ధారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫీజుల పెంపునకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు
ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు
ఇంజినీరింగ్,((Engineering) వృత్తి విద్యా కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నిషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనలవైపు ప్రోత్సహిస్తున్నారా అనే అంశాల్ని పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా కాలేజీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా లేదా, ఆ కాలేజిల్లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలపైనా దృష్టి సారించనున్నది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, ప్రభుత్వ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాలను పరిశీలించిన తర్వాతే కళాశాలల్లో ఫీజులను నిర్ధారించనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
కమిటీ నివేదిక ఆధారంగా..
ఇంజినీరింగ్,(Engineering) ఫీజుల నిర్ధారణపై ప్రభుత్వానికి తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నివేదిక సమర్పించింది. ఆ రిపోర్ట్ ఆధారంగా టీఏఎఫ్ఆర్సీ 2006లో గైడ్ లైన్స్‌లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులు పెంచుకోవాలనుకునే యాజమాన్యాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని, తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఫీజుల నిర్ణయం కోసం టీఏఎఫ్ఆర్సీకి రిపోర్ట్‌ను నోటరైజ్డ్ అఫిడవిట్‌తో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమర్పించిన రిపోర్ట్, గణాంకాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత చట్టాలు నియమాల ప్రకారం చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఒక సంస్థ ప్రతిపాదించిన ఫీజును ఆమోదించడానికి లేదా మార్చడానికి టీఏఎఫ్ఆర్సీకి హక్కు ఉంటుందని తెలిపింది.
కోర్టు ఆదేశాల తర్వాత..
తెలంగాణలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజినీరింగ్,(Engineering)ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయం కోసం కొత్త పారా మీటర్లను సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని గత నెలలో ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి, సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను పరిగణనలోకి తీసుకుని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఇదిలా ఉండగా గత నెలలో ఫీజుల నిర్ధారణకు గైడ్ లైన్స్ రూపొందించాలని హైకోర్టు 45 రోజుల గడువు ఇచ్చింది. టీఏఎఫ్ఆర్సీ విజ్ఞప్తి, హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఫీజుల నిర్ధారణపై ఉన్న నియమాలను ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సర్కార్ కోర్టుకు సమర్పించనున్నది. ఈ ఫీజుల పెంపు అంశం ఏ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది అనేది కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాదికి పాతవే..
ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని జూన్ 30న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే వర్తిస్తాయంటూ జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. విచారణ జరిపిన న్యాయస్థానం కాలేజీల ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీకీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ఈ నెల 22తో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజు నిర్ధారణ నిబంధనలను సవరణలు చేపట్టింది.
Also Read: Toddy Adulteration: గద్వాల జిల్లాలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు.. కల్లు దందాలో వారిదే పెత్తనం