తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Outsourcing Employees: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీని నియమించింది. మండల స్థాయి నుంచి జిల్లా, హెచ్ఓడీ, సెక్రెటేరియట్ వరకు ప్రతీ విభాగంలో ఈ రెండు రకాల పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించే కసరత్తును మొదలుపెట్టింది. మెరుగైన సేవలు అందించేలా, పనిలో వేగాన్ని పెంచేలా, సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించేలా, ప్రజాధనాన్ని సమర్ధవంతంగా వినియోగించేలా ఇలా వివిధ లక్ష్యాలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) ఎన్.శివశంకర్ (ప్రస్తుతం వేతన సవరణ సంఘం చైర్మన్‌గా ఉన్నారు), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఫైనాన్స్ డిపార్టుమెంటు డిప్యూటీ సెక్రెటరీ ఈవీవీ నాగేశ్వరరావులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కమిటీని నియమించారు. నెల రోజుల వ్యవధిలో రిపోర్టును సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు వారాలు గడిచినందున మరో రెండు వారాల్లో రిపోర్టు తయారు కానున్నది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ మండల స్థాయి నుంచి సచివాలయం వరకు సేకరించిన వివరాలను అంశాలవారీగా ఆ సర్క్యులర్‌లో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పొందుపరిచారు.
Also Read: Fake Doctors: అర్హత లేదు కానీ, డాక్టర్లేనట.. ఇక వీరికి చుక్కలే!
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకునే విధానం అమల్లో ఉన్నదని, ఇందుకు నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు కూడా ఉన్నాయని, కానీ ఇప్పుడు ఏ విభాగంలో ఏ అవసరానికి ఎంతమంది పనిచేస్తున్నారో ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదంటూ పలు సందర్భాల్లో వివిధ శాఖల అధికారుల నుంచి వ్యాఖ్యలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు కసరత్తును ప్రారంభించింది. రిటైర్ అయిన ఉద్యోగులను ఎక్స్ టెన్షన్ పేరుతో కొనసాగిస్తున్నట్లు గతంలో ఆరోపణలు రావడంతో వివరాలను సేకరించిన ప్రభుత్వం 1,049 మంది ఉన్నట్లుగా తేల్చింది. వారిని సాగనంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఆర్థిక శాఖ సేకరిస్తున్న గణాంకాలతో స్పష్టత రానున్నది. ఈ ముగ్గురు అధికారులతో కమిటీ సేకరించాల్సిన వివరాలు ఇవే:
ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది ఎన్ని పోస్టులకు ఏ విభాగంలో హెచ్ఓడీలో మంజూరైన పోస్టులెన్ని? మండలం, జిల్లా, హెచ్ఓడీ, సచివాలయం అన్ని స్థాయిల్లో వివరాలను సేకరించాలి. ప్రస్తుతం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎందరు మంజూరైన పోస్టులతో పోలిస్తే ఎక్కువా తక్కువా? ఎప్పటి నుంచి వీరు కొనసాగుతున్నారు? ఆయా విభాగాల్లో రెగ్యులర్ పోస్టులు మంజూరై బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతూనే ఉన్నారా? అయినట్లయితే అవసరమేంటి? మంజూరైన పోస్టుల కంటే అదనంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఎందుకు రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది? సహేతుకమైన తీరులోనే నియామకాలు జరిగాయా? రిక్రూట్‌మెంట్ అవసరానికి నిర్దిష్ట కారణాలేంటి అనే అంశాలను సేకరించనున్నారు.
సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తున్నారా? అటు విభాగాలుగానీ ఇటు ఏజెన్సీలుగానీ ఉల్లంఘిస్తున్నాయా? ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ అమలవుతున్నాయా? లీగల్ చిక్కులేమైనా ఉన్నాయా విభాగాలు, హెచ్ఓడీలు మరింత సమర్ధవంతంగా పనిచేయాలంటే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించడం, కొనసాగించడం, తొలగించడం.. వీటిపై సిఫారసులు చేయాలి. ప్రజాధనాన్ని సమర్ధవంతమైన తీరులో వినియోగించేందుకు వీలుగా ఈ రెండు రకాల సిబ్బంది విషయంలో అనుసరించాల్సిన పద్ధతులేంటి? అని మొత్తం డాటాను సేకరించనున్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/