Revanth Reddy on KCR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ (K. Chandrashekar Rao) తొలిరోజు మాత్రమే సభకు వచ్చి రెండో రోజు డుమ్మా కొట్టడంపైనా తనదైన శైలిలో రేవంత్ సెటైర్లు వేశారు. అటు కాంగ్రెస్ అధినాయకత్వంతో గ్యాప్ వచ్చిందన్న వార్తలపైనా రేవంత్ మాట్లాడారు. మరోవైపు అసెంబ్లీలో జరిగిన రచ్చ గురించి మంత్రి శ్రీధర్ బాబు.. రేవంత్ రెడ్డికి వివరించారు.
‘ఒకరోజు వస్తే సరిపోదు’
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటన సందర్భంగా విపక్ష నేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తే సరిపోదని.. అసెంబ్లీలో చర్చలకు సైతం హాజరు కావాలని సూచించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినాయకత్వంతో గ్యాప్ వచ్చిందంటూ ఇటీవల పెద్ద ఎత్తున వచ్చిన వార్తలపైనా సీఎం స్పందించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్న రేవంత్.. ప్రతీసారి ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని అన్నారు. తానేంటో తెలియకుండానే నన్ను పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిని చేశారా అంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో తాను తీసుకొచ్చిన విఫ్లవాత్మక పాలసీలు ఎవరూ చేయలేదని రేవంత్ అన్నారు. రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు చెప్పారు. అటు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి పై ఫైర్
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపైనా రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర క్యాబినేట్ లో ఉన్న నిర్మలా సీతారామన్.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు మెట్రో తీసుకురావడంలో కృషి చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్ర అంశాలను పెడ చెవిన పెట్టారని మండిపడ్డారు. మరోవైపు ఎన్నికల్లో టికెట్లు రాని వారికి న్యాయం చేస్తానని గతంలోనే హామీ ఇచ్చినాన్న రేవంత్.. ఇందులో భాగంగానే 37మందికి కార్పోరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించినట్లు చెప్పారు.
Also Read: Telangana Assembly: సభలో ప్రశ్నల తూటాలు.. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్
సీఎంకు శ్రీధర్ ఫోన్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సభలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సభ మీ సొంతం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టారు. కాగా, సభలో చోటుచేసుకున్న గందరగోళం గురించి మంత్రి శ్రీధర్ రెడ్డి.. సీఎం రేవంత్ కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. సభలో జరిగిన రచ్చ గురించి రేవంత్ కు మంత్రి వివరించినట్లు సమాచారం.