Transport Department: రవాణా శాఖకు 2025-26 వార్షిక సంవత్సరానికి 9 నెలల ఆదాయం రూ.5,142 కోట్లు సమకూరిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రవాణా శాఖకు(Transport Department:) జీవిత కాలపు పన్నుల ద్వారా రూ. 3,611 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ. 730 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ. 57 కోట్లు, ఫీజుల ద్వారా రూ.408 కోట్లు, తనిఖీల ద్వారా రూ.181 కోట్లు సర్వీస్ చార్జీల ద్వారా రూ.153 కోట్లు సమకూరిందని పేర్కొన్నారు. 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.6,165 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.5,142 కోట్లతో 83శాతం సాధించామని వివరించారు.
Also Read: TG Transport Department: బీ కేర్‌ఫుల్.. ఈ నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్..!
ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు అడ్డగోలు ఛార్జీలు వసూలు చేసినా, సరుకు రవాణా చేసినా, స్టేజీ క్యారేజీగా నడిపినా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ విస్తృత తనిఖీలు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐటి జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలను.. ఫిట్‌నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు రోడ్డు భద్రత మాస ఉత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓవర్ లోడ్ వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రైవేట్ బస్సులు సైతం రవాణా శాఖ నిబంధనలు పాటించాలని చంద్రశేఖర్ గౌడ్ సూచించారు.

