TG Global Summit: హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) ప్రత్యేకంగా ఆహ్వానించారు. జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం హేమంత్ సోరెన్‌కు భట్టి విక్రమార్క అందజేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్ సంకల్పంతో ముందుకు సాగుతుందని భట్టి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వివరించారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు వివరించారు.
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ ఆహ్వానం
తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. శక్రవారం న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఒమర్ అబ్దుల్లాకు అందజేశారు. కాగా, సమ్మిట్‌కు వారు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసించారన్నారు. దీంతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు.
Also Read: Nalgonda District: ఏసీబీ వలలో చిక్కిన చండూరు మండలం డిప్యూటీ ఎమ్మార్వో..!
ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) శుక్రవారం ఆహ్వానించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన వెంకట్ రెడ్డి.. రైసింగ్ తెలంగాణ విజన్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఏపీ సీఎంతో సుమారు గంటన్నర పాటు సాగిన భేటిలో ఇరు తెలుగు రాష్ట్రాల పలు అంశాలు చర్చించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు మంత్రి అడ్లూరి ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించేందుకు శుక్రవారం స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఈ మేరకు సీఎం సుఖ్వీందర్‌ను కలిసి ఈ సమ్మిట్‌కు హాజరవ్వాలని ఆహ్వానించారు.
Also Read: Kamalapuram Panchayat: సీఎం రేవంత్ పీఆర్వో ఎన్ఆర్ఐల కృషితో.. ఓ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం!

