Maoist Hidma: మోస్ట్ వాంటెడ్ హిడ్మా కర్రె గుట్టల్లో ఉన్నట్టా లేనట్టా? అనేది పూర్తి సమాచారం ఎవరికీ తెలియదు. ఛత్తీస్‌గడ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర సాయుధ బలగాలతో కర్రె గుట్టల ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. హిడ్మా దళం అక్కడ ఉందని సమాచారంతోనే పోలీస్ బలగాలు ఆపరేషన్ ను వేగవంతంగా కొనసాగిస్తున్నారు.
అయితే అక్కడి నుంచి కర్రెగుట్టల ప్రాంతం పోలీసుల ఆధీనంలోకి రాకముందే ఐదు అంచెల భద్రతతో తప్పించుకున్నాడనే చర్చ కొనసాగుతుండడం గమనార్హం. తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు చాలాసార్లు ప్రచారం సాగింది.
అయినప్పటికీ వివిధ ఘటనాల్లో హిడ్మా చాకచక్యంగా తప్పించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తెలంగాణ గ్రేహౌండ్స్ ఛత్తీస్‌గడ్ సీఆర్‌పీఎఫ్ కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్ లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లు చాలా వార్తలే వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్‌గడ్ మావోయిస్టు పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన హిడ్మా పోలీసులకు చిక్కడు దొరకడు అనే విధంగా చాకచక్యంగా తప్పించుకోవడం ఆయన నైజం.
హిడ్మా నేపథ్యం
2011 ఏప్రిల్ సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైండ్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాత్రతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటనలో ఇతను కీలకంగా తెరపైకి వచ్చాడు. ఇందులో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు సాధారణ పౌరుడు సైతం మృత్యువాత చెందారు. 2017 మార్చి 12న సుప్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళుతున్న జవాన్లపై ఈయన ఆధ్వర్యంలోనే దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
2017 ఏప్రిల్ 24 న చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్కపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది మృత్యువాత చెందారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో సుక్మా జిల్లా పిడిమెట్ అటవీ ప్రాంతంలో మందు పాత్ర పేల్చి కాల్పులు జరిపిన ఘటనలో 12 మంది జవాన్లు సైతం మృతి చెందారు.
2021 ఏప్రిల్ లో జరిగిన జీను గూడెం అడవిలో హిడ్మా ఉన్నాడని సమాచారంతో భద్రతా బలగాలను నమ్మించి ఆయన్ను పట్టుకునేందుకు వచ్చిన వారిలో 26 మందిని హతమార్చిన ఘటన సైతం ఉంది. చాలాకాలం పోలీసులకు ఫోటో దొరకకుండా జాగ్రత్త పడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్ లోనే చాలామందికి తెలియని సీక్రసీ ఉండేది. ఈ ఘటనల నేపథ్యంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి ఆయనను తీసుకోవడంపై పార్టీలో చాలా విభేదాలు వచ్చాయి.
Also read: Ex MLA Shakeel Aamir: అవినీతి ఆరోపణలు.. నోరు విప్పిన ఆ మాజీ ఎమ్మెల్యే!
మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణయాకమైన కేంద్ర కమిటీలో ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంతమంది మావోయిస్టు సానుభూతిపరులు సైతం విమర్శించిన ఘటనలు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసా మార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా చాలా వాదనలు సైతం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల్ని చంపడంలో ఈయన చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని వాదనలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు కూడా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని దాదాపు పది మంది వరకు రాత్రింబవళ్లు హిడ్మా కు కాపలా కాస్తారని మాజీ మావోలు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న హిడ్మా కు 5 అంచల భద్రత ఉంటుందని ఆ నేపథ్యంలోనే తప్పించుకున్నాడా… కర్రెగుట్టల్లోనే ఉన్నారా అనేది చర్చ సాగుతోంది.
అయితే కర్రె గుట్టల ప్రాంతంలో జరిగే ఆపరేషన్ పై ఛత్తీస్‌గడ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం మీడియాకు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే వరంగల్ లో సెంట్రల్ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది మావోలు లొంగిపోయినట్లు వెల్లడించారు.
కొనసాగుతున్న ఆపరేషన్ కగార్
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనసాగిస్తున్న కగార్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి అతి సమీపంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో సాయుధ బలగాలు నిర్విరామంగా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.