Urea Supply: రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను ( Urea Shortage) వెంటనే సరఫరా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కేంద్రాన్ని కోరారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు యూరియా సరఫరాలో ఏర్పడిన లోటును కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో బుధవారం కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ను వేర్వురుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఆలస్యం తలెత్తితే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని.. కేటాయించిన యూరియాను తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ యూరియాను కూడా ఆగస్టు నెల కేటాయింపులతో పాటే సరఫరా చేయాలని జేపీ నడ్డాను విజ్ఞప్తి చేశారు.
క్రూడ్ పామాయిల్ పై (Crude Palm Oil Import ) దిగుమతి సుంకాన్ని మార్చి 2018 లో ఉన్నట్టుగా 44 శాతానికి పెంచాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతం తగ్గించడం తో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో పాటు , ఇది ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకానికి అడ్డంకిగా మారనుందన్నారు. దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 44 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి పునః సమీక్షించాలని కోరారు. కేంద్రం ప్రాయోజిత పథకమైన ఎన్ఎంఈఓ-ఓపీ పథకంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ప్లాంటేషన్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకోసం చేస్తున్న కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. క్రూడ్ పామాయిల్ పై తగ్గించిన దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలనికోరారు. మంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
