Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా, రికార్డు స్థాయిలో రూ.60,799 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తెలంగాణను బహుళ జాతి సంస్థలకు కేంద్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ భారీ నిర్మాణాల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, లక్షలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర గతిని మార్చేలా..
కోమటిరెడ్డి ప్రకటించిన ముఖ్యమైన రహదారి ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చనున్న రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఏకంగా రూ.36వేల కోట్లు కేటాయించారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్లు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణంతో కూడిన హ్యామ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. రూ.8వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. అంతేకాకుండా, దేశానికే తలమానికంగా మారనున్న ‘ఫ్యూచర్ సిటీ’ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది. రూ.20వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారనుంది.
Also Read: Telangana Winter Season: తెలంగాణలో సడెన్‌గా మారిపోయిన వాతావరణం.. ఈ ఏడాది చలి అంచనా ఇదే
తెలంగాణే లక్ష్యం
ఈ రహదారుల నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని కోమటిరెడ్డి తెలిపారు. రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయని, ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలకు అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి, భట్టిలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, తన రాజకీయ జీవితంలో ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.
Also Read: Warangal Floods: మీ నిర్లక్ష్యం వల్లే వరదలు.. వరద ముంపు బాధితుల ఆగ్రహం..!
