Education Reforms: కొత్త ఏడాదిలో విద్యా రంగం కొత్త పుంతలు
Education Reforms (imagecredit:swetcha)
Telangana News

Education Reforms: కొత్త ఏడాదిలో ఉన్నత విద్యా రంగం కొత్త పుంతలు.. జరిగే మార్పులివే..!

Education Reforms: కొత్త ఏడాదిలో ఉన్నత విద్య రంగం కొత్త పుంతలు తొక్కనున్నది. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి 2026 విద్యా సంవత్సరానికి గానూ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నది. కోర్సుల హేతుబద్ధీకరణ నుంచి అకడమిక్ ఆడిట్ వరకు సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. ఉన్నత విద్యలో నవ చైతన్యానికి దిశానిర్దేశం చేసేలా సమగ్ర ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పాలనాపరమైన సంస్కరణలు, నైపుణ్యాధారిత ఉన్నత విద్యా కోర్సులతో 2026ను కీలకంగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తున్నది. డిగ్రీ సిలబస్‌లో భారీ మార్పుల నుంచి మొదలు అకడమిక్ ఆడిట్‌ను మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దోస్త్ ద్వారా సకాలంలో సీట్ల భర్తీ చేపట్టడం, అన్ని కోర్సుల్లోనూ వేగవంతమైన కౌన్సెలింగ్ ప్రక్రియ, ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని కూడా ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. పారిశ్రామిక సంస్థల సమన్వయంతో ఉన్నతస్థాయి నైపుణ్యాభివృద్ధికి పాటు పడాలని భావిస్తున్నారు.

డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రయారిటీ

కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి పలికి, ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను హేతుబద్ధీకరించాలని విద్య మండలి నిర్ణయించింది. విద్యార్థులు లేని, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న కోర్సుల స్థానంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇన్నాళ్లూ కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులకే పరిమితమైన నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కార్యక్రమాలను, ఇకపై సాధారణ డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ) కోర్సుల్లోనూ విధిగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసరికి ఏదో ఒక విభాగంలో చేతినిండా పని దొరికేలా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అంతేకాకుండా కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ‘అకడమిక్ ఆడిట్’ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. బోధన పద్ధతులు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ నైపుణ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా విద్యా సంస్థల జవాబుదారీతనాన్ని పెంచనున్నారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా విద్యామండలి వెనకాడడం లేదు.

Also Read: Kingdom Sequel Cancelled: ‘కింగ్డమ్ 2’ ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ఉపాధి అవకాశాలు పెంచేలా..

దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 2025లో ఎదురైన వాస్తవ పరిస్థితులను ఉన్నత విద్యామండలి సమీక్షించింది. సీట్లు భారీగా మిగిలిపోవడానికి గల కారణాలను విశ్లేషించింది. అందుకే 2026లో కోర్సులు, సీట్ల హేతుబద్ధీకరణ ప్రధాన అజెండాగా ఉండనున్నది. డిమాండ్ ఉన్న కోర్సులు, ఉపాధి అవకాశాలు పెంచే కొత్త కోర్సులు, ప్రతి కోర్సులో ఆధునీకరణ ఎలా తీసుకురావాలన్న అంశాలపై గత కొన్ని నెలలుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విస్తృత కసరత్తు చేపట్టినట్లు తెలుస్తున్నది. కొత్త సంవత్సరంలో వాటి అమలు, ప్రారంభమవుతుందన్న ఆశాభావంతో ఉన్నది. ప్రతి ఉన్నత విద్యా సంస్థకు జాతీయ గుర్తింపు(న్యాక్) కీలకం. అందుకే 2026ను న్యాక్ గుర్తింపు సాధన లక్ష్య సంవత్సరంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి 2026లో ఉన్నత విద్యామండలి తీసుకోబోయే ఈ నిర్ణయాలు రాష్ట్ర విద్యా ముఖచిత్రాన్ని మార్చనున్నట్లుగా అర్థమవుతున్నది. ఉన్నత విద్యను కేవలం పట్టాలకే పరిమితం చేయకుండా, నైపుణ్యాల గనిగా మార్చడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.

సంస్కరణలు ప్రశంసనీయం: సీఎం కితాబు

ఉన్నత విద్యలో సంస్కరణల ఒరవడి ఇదే స్థాయిలో కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మండలి పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచలనకు ఉన్నత విద్యా మండలి కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని కొనియాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉన్నత విద్యామండలి చైర్మన్ గురువారం కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి సేవలను సీఎం ప్రస్తావించినట్లు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి దిశగా అన్ని స్థాయిల సమన్వయంతో చైర్మన్ చేస్తున్న కృషిని సీఎం ప్రస్తుతించారన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉన్నత విద్య జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి వివిధ సందర్భాల్లో ఆకాంక్షించారన్నారు. సీఎం మనోభావాలకు అనుగుణంగా బాలకిష్టారెడ్డి ఏడాదిగా అనేక అంశాలపై కసరత్తు చేశారు. సిలబస్‌ మార్పు, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై విస్తృత చర్చలు జరిపారు. ఈ దిశగా సాగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కృషి ఇలాగే కొనసాగాలని, ఇతర దేశాల్లో వస్తున్న విద్యా పరమైన మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తాం

కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తాం. ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్‌ను మరింత సరళీకరించి ప్రతి విద్యార్థి సులభంగా ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని అందించేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సాధనలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో సులభంగా నేర్చుకునేలా నిపుణుల ద్వారా పాఠ్యాంశాలను పీడీఎఫ్ రూపంలో రూపొందించాం. 2026లో ఈ వనరులు విద్యార్థులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ అన్నారు.

Also Read: Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు

Just In

01

Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా.. కొత్త ఏడాదికి వెల్కమ్ పెద్దగా పలికాడు..

Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది: హరీష్ రావు ఫైర్..!

GHMC: ఫిబ్రవరి 10 తర్వాత.. జీహెచ్ఎంసీ మూడు ముక్కలు

Allu Arjun: స్టాఫ్‌తో న్యూయర్ వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..

Nominated Posts: కొంచెం ఓపిక పట్టండి.. అందరికీ గుర్తింపు ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి