BC Reservations (image credit: twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేటికి వాయిదా పడ్డ విచారణ.. లైన్ క్లియర్ అయినట్టేనా?

BC Reservations: బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై హైకోర్టులో(High Court) వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ తమ వాదనలు బలంగా వినిపించటంతో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ చాలాసేపు నెలకొంది. కాగా, దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నేటి మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసి పుచ్చింది.

ఈ క్రమంలో నేడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయ్యింది. కాగా, బీసీ రిజర్వేషన్లపై విచారణ జరిగిన నేపథ్యంలో హైకోర్టు వద్దకు భారీ సంఖ్యలో వేర్వేరు పార్టీల కార్యకర్తలు, సాధారణ పౌరులు వచ్చారు. సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు వీ.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతుండగా ఓ న్యాయవాది అడ్డుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు మావే.. పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

26మంది బీసీ నాయకులు ఇంప్లీడ్​ పిటిషన్లు దాఖలు

ఈ మేరకు జీవో (నెంబర్​ 9)ను కూడా విడుదల చేసింది. కాగా, రిజర్వేషన్లను సవాల్ చేస్తూ మాధవరెడ్డి, రమేశ్ అనే వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. కాగా, రిజర్వేషన్లకు అనుకూలంగా బీసీ నేత ఆర్​.కృష్ణయ్య, వీ.హనుమంతరావుతోపాటు మరో 26మంది బీసీ నాయకులు ఇంప్లీడ్​ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.పిటిషనర్ల తరపు న్యాయవాదులు మొదటగా వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను పెంచే అధికారం ప్రభుత్వానికి ఉన్నా అవి 5‌‌0శాతానికి మించరాదని చెప్పారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయన్నారు. ఏజన్సీల్లో ఉండే ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదని చెప్పారు. ఇక, తాజాగా బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్లపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపించ లేదన్నారు. బీసీ కులగణన చేసినట్టు చెబుతున్నారు.

అయితే, ఆ వివరాలను బయటకు వెల్లడించ లేదన్నారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెబుతూనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా లెక్కలు ఆధారమని అంటున్నారని, ఇదెక్కడి న్యాయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గిందా? పెరిగిందా? అన్న లెక్కలు ప్రభుత్వం వద్ద లేవన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను పెంచుతారన్నారు. 2018లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ రాజ్యాంగ విరుద్ధంగా వాటిని ఎలా నిర్వహిస్తారని అన్నారు.

ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు

ఇక, ట్రిపుల్ టెస్ట్ ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వేషన్లు 50శాతం దాటటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. 2021, డిసెంబర్ లో ట్రిపుల్ టెస్ట్ పై మార్గదర్శకాలు ఉన్నట్టు తెలిపారు. బీసీ జనగణన కోసం డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలని సుప్రీం కోర్టు సైతం మార్గదర్శకాలు ఇచ్చినట్టు తెలియచేశారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు లభించిందన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకెళుతోందని చెప్పారు.

చట్టసభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా?

బీసీ ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి 50శాతానికి మించి రిజర్వేషన్లను పెంచే అధికారం ఉందన్నారు. చట్టసభలు చేసిన చట్టాలపై కొందరు గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం చేస్తూ వాటిని త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారన్నారు. నెలలపాటు ఏ నిర్ణయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారన్నారు. బిల్లును ఆమోదించటం లేదు…తిరస్కరించటం లేదని తిప్పి పంపించటం లేదన్నారు. తమిళనాడులో ఓ బిల్లు గవర్నర్ వద్ద ఏళ్ల తరబడిగా పెండింగ్​ లో ఉందన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా? అని అంటూ ఆర్టికల్ 200ను కొందరు గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

గవర్నర్లు సకాలంలో నిర్ణయం తీసుకోక పోతుండటంతో వ్యవస్థ స్తంభించి పోతోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా గవర్నర్ ఇదేవిధంగా వ్యవహరించారన్నారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చ లేని పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్​ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దన్న తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్​ కు సంబంధించిన నోటిఫికేషన్ ను ధర్మాసనానికి అందచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టే ఇవ్వటం సరికాదన్నారు.

గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది?

సమగ్ర అధ్యయనం తరువాతే బీసీ రిజర్వేషన్ల బిల్లు రూపొందించి జీవో ఇచ్చినట్టు చెప్పారు. పూర్తి వాదనలు విన్న తరువాతే జీవో 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ సమయంలో ధర్మాసనం అడ్వకేట్ జనరల్​ కు పలు ప్రశ్నలను సంధించింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది? ట్రిపుల్ టెస్ట్ విధానం అమలు చేశారా? బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా జరిపారు? కమిషన్ రిపోర్టు పబ్లికేషన్ చేశారా? ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారా? అని అడిగింది. ఎన్నికల షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని కూడా ప్రశ్నించింది. ఇంకా వాదనలు వినిపించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్​ చెప్పటంతో విచారణను నేటి మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఇక, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరగా ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది.

న్యాయవాదిపై ఆగ్రహం

వాదనలు సమయంలో హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన సుదర్శన్​ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు వినిపిస్తూ న్యాయవాది సుదర్శన్​ బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయింపు జరగలేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇదేమీ చివరి విచారణ కాదు…అన్ని అంశాలను ప్రస్తావించి మా ఓపికను పరీక్షించొద్దు…గంటలకొద్దీ అదే అంశాన్ని పేర్కొంటూ కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని మండి పడ్డారు.

కోర్టుకు వచ్చిన మంత్రులు

బీసీ రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితోపాటు టీపీసీసీ ఛీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్ న్యాయస్థానానికి వచ్చారు. కోర్టు హాల్లో జరిగిన వాదనలను విన్నారు.

వీహెచ్​ తో వాగ్వావాదానికి దిగిన లాయర్

బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వీ.హెచ్​.హనుమంతరావు హైకోర్టు బయట మీడియాతో మాట్లాడుతుండగా అడ్వకేట్ శ్రీనివాస్​ అడ్డుకున్నారు. రైతులకు అయిదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటివరకు రైతులకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన హనుమంతరావును వెనక్కి నెట్టేయటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించి వేయటంతో పరిస్థితి సద్దుమణిగింది.

Also Read: Peddi leaked photos: ‘పెద్ది’ సినిమా నుంచి వైరల్ అవుతున్న అనధికార పిక్స్.. నిర్మాతలపై మండి పడుతున్న ఫ్యాన్స్

Just In

01

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?