Sc sub classification: ఎస్సీ వర్గీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం (TG Govt).. దానికి చట్టబద్ధత కల్పించి, ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ (Reservations) అమలు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, బిల్లును ప్రవేశపెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత, ఆమోదం పొంది చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. సర్కారీ కొలువుల భర్తీకి జారీ చేసే నోటిఫికేషన్లలో వర్గీకరణ రిజర్వేషన్ ఫార్ములాను అమలు చేయాలనుకుంటున్నది. అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే జస్టిస్ షమీమ్ అఖ్తర్ (Justice Shamim Akhtar) నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ (One Man Commission) సమర్పించే నివేదికను విధిగా మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున విధానపరమైన నిర్ణయాలు తీసుకోడానికి పరిమితులు ఏర్పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. క్యాబినెట్ భేటీ నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నదని, చట్టబద్ధత కల్పించని కారణంగా మాదిగ కులంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన దళిత కులాలు, ఉప కులాలకు ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరుగుతున్నదని ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) (MRPS) లాంటి కొన్ని సంస్థలు, కుల సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వర్గీకరణకు వీలైనంత తొందరగా చట్టబద్ధత కల్పించేలా కార్యాచరణను చేపట్టింది.
అందుకే గడువు పొడిగింపు
ఇటీవల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తడంతో పాటు పలు సూచనలు చేశారు. వీటిని పరిశీలించి, నివేదికలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఏకసభ్య కమిషన్ గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ (Extension) ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీలైనంత తొందరగా నివేదిక అందితే దాన్ని తొలుత క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా సిఫారసులు చేయనున్నది. క్యాబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి రాగానే వర్గీకరణపై చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశమున్నది. అసెంబ్లీలో ఆమోదం లభించగానే గవర్నర్ గ్రీన్ సిగ్నల్‌తో అమల్లోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మార్చి ఫస్ట్ వీక్‌లోనే అసెంబ్లీ సెషన్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రాథమికంగా భావిస్తున్నందున ఆలోపే కమిషన్ నుంచి ఫైనల్ రిపోర్టు రావడం, క్యాబినెట్ ఆమోదం తెలపడం పూర్తయ్యే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించడంతో విడుదల కానున్న నోటిఫికేషన్లలో వర్గీకరణ ప్రకారమే భర్తీపై స్పష్టత లభించే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
మార్చ్ సెకండాఫ్‌లో క్లారిటీ!
ఇప్పటికే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మార్చ్ నెల సెకండాఫ్ వరకు క్లారిటీ రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న వర్గీకరణపై సంచలన తీర్పును ఇవ్వడంతో చట్టబద్ధత కల్పించి అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలవడంతో పాటు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెసులుబాటు లభిస్తుంది. వర్గీకరణకు చట్టబద్ధత రాగానే గజ్వేల్‌లో భారీ బహిరంగసభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి సెకండ్ వీక్‌లోనే వర్గీకరణకు చట్టబద్ధత లభించే అవకాశాలున్నాయి. ఆ వెంటనే జాబ్ నోటిపికేషన్లలో వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్ ఫార్ములా అమలయ్యేలా స్పష్టత వస్తుంది. వర్గీకరణ జరగకుండా జాబ్ నోటిఫికేషన్లు రావడంతో మాదిగలకు అన్యాయం జరుగుతున్నదనే ఆరోపణలకు తావు లేకుండా ప్రభుత్వం చట్టబద్ధత కోసం కార్యాచరణను వేగవంతం చేసింది.
ఇదీ చదవండీ
CM REVANTH: ఐఏఎస్ లకు లెక్చర్… మేధావుల మెప్పు పొందిన సీఎం రేవంత్