New Liquor Brands in TG: మద్యం ప్రియులకు శుభవార్త. తాగిన బ్రాండ్లే మళ్లి మళ్లి తాగాలంటే బోర్ కదా! కాబట్టే వాళ్లకు మరింత కిక్కిచ్చేందుకు.. వచ్చే కిక్కును సరికొత్తగా అందించేందుకు సర్కారు ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించడానికి చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనుంది. తద్వారా తెలంగాణలో ఇప్పటిదాకా లేని విదేశీ అలాగే దేశీయ లిక్కర్, బీర్ కంపెనీల వాళ్ల నుంచి దరఖాస్తులను స్వీకరించబోతున్నారు.
అయితే అందుకు గాను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కంపెనీలకు కొన్ని షరతులు విధించింది. ఇక్కడ రిజిస్టర్ కాని కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలను పరిశీలించినుంది. దానికి ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ను తీసుకోనుంది. అలాగే ఇతర రాష్ట్రాలలో తమ మద్యం అమ్మకాలలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికేషన్ కూడా దరఖాస్తులో జత పరచాలని స్పష్టం చేసింది.
కొంతకాలం క్రితం పలు కొత్త కంపెనీలకు ప్రభుత్వ పర్మిషన్ ఇవ్వాలని యోచించినప్పటికీ సదరు కంపెనీలపై ఆరోపణలు రావడంతో వెనక్కి తగ్గింది. కాబట్టే ఈ సారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే సర్టిఫికేట్లను తప్పనిసరిగా జత చేయాలని షరతులు విధించింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి నూతన విధానానికి నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందే బహిరంగ ప్రకటన ఇవ్వాలని టీజీబీసీఎల్ కు ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కంపెనీల నుంచి వచ్చి అప్లికేషన్లను 10 రోజుల పాటు ఆన్లైన్ లో పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రిజిస్టరై ఉండి… సరాఫరా చేస్తున్న కంపెనీలు మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.