కంచె గచ్చిబౌలి దగ్గరలో ప్రభుత్వ భూమి
మాస్టర్ ప్లాన్ లే ఔట్ తర్వాత విక్రయం
డెవలప్ చేసిన తర్వాత 5 దశల్లో వేలం
టెండర్ కోసం టీజీఐఐసీ నోటిఫికేషన్
దాఖలు చేసేందుకు మార్చి 15 గడువు
ఎక్కువ రెవెన్యూ వచ్చే మార్గంపై అన్వేషణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రానికి ఆదాయం సమకూరేలా ప్రణాళిక వేసుకున్న సర్కార్, శేరిలింగంపల్లి సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలాన్ని డెవలప్ చేసి వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం కలిగిన సంస్థలను ఎంపిక చేయాలని భావించింది. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ద్వారా టెండర్ నోటిపికేషన్ గత నెల 28న విడుదలైంది. హైటెక్ సిటీ (సైబర్ టవర్స్)కి 8 కి.మీ. దూరంలో (సర్వే నెం. 25-పి) ఉన్న ఈ స్థలానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి లే ఔట్‌గా అభివృద్ధి చేసి, ఆ తర్వాత వేలం ద్వారా విక్రయించాలని భావిస్తున్నది. ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలోని 400 ఎకరాలను కమర్షియల్, రెసిడెన్షియల్, పబ్లిక్ పార్క్, స్కై వే, ఇలా ఏ రూపంలో అభివృద్ధి చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో ఆలోచిస్తున్నది. ఈ అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించేలా టెండర్ నోటిఫికేషన్‌లో టీజీఐఐసీ పేర్కొన్నది.
మూడు విభాగాలుగా లే ఔట్
మూడు విభాగాలుగా ఈ స్థలాన్ని ఏ రూపంలో లే ఔట్ డెవలప్‌మెంట్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి తుది నివేదికతో పాటు రెండు ప్రత్యామ్నాయ నివేదికలను ఇవ్వాలని టీజీఐఐసీ సూచించింది. మొదటి దశలో ఈ స్థలం ఉన్న లొకేషన్ ఆధారంగా ఏ రకంగా వినియోగించవచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, సప్లై-డిమాండ్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక కోణం నుంచి అధ్యయనం చేయాలని పేర్కొన్నది. రెండో దశలో మాస్టర్ ప్లాన్ లే ఔట్ డెవలప్‌మెంట్‌ను రూపొందించి నిర్దిష్టంగా ఏ అవసరాలకు ఈ భూమిని ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో నివేదికలో పొందుపరచాలని సూచించింది. మూడవ దశలో వేలం ప్రక్రియను దశలవారీగా (ఐదు ఫేజ్‌లలో) విక్రయించడానికి ఉన్న మార్గాలను సూచించాలని పేర్కొన్నది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మూడు దశల్లో అందాల్సిన నివేదికలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ప్రభుత్వ విభాగాల అనుమతులపై..
హైదరాబాద్‌కు పశ్చిమ దిక్కుగా ఇప్పటికే గణనీయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఒకేచోట 400 ఎకరాల భూమి లభ్యత కీలకమైన అంశం అవుతుందని భావించిన టీజీఐఐసీ.. రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న అనుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని మైక్రో లెవల్‌లో మార్కెటింగ్ కోణం నుంచి ఆలోచించాలని టెండర్ డాక్యుమెంటులో పేర్కొన్నది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు ఏ మేరకు అనుకూలంగా ఉంటాయో, ఈ స్థలాన్ని ఏ రూపంలో డెవలప్ చేస్తే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో రిపోర్టులో సూచించాలని పేర్కొన్నది. అవసరమైతే ప్రభుత్వ విభాగాల నుంచి భూముల మార్పిడి, నిబంధనల్లో సవరణలు, అనుమతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొన్నది. మార్కెట్ డైనమిక్స్ కు అనుగుణంగా డెవలప్‌మెంట్ ప్రణాళికలను సూచించాలని స్పష్టం చేసింది. విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున భవనాల ఎత్తుకు ఉన్న నిబంధనలు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ప్రస్తుతం ఉన్న రవాణా సదుపాయాలతో పాటు లే ఔట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టాల్సిన అంశాలను సూచించాలన్నది.
మార్కెట్‌లో సప్లై-డిమాండ్ ట్రెండ్
గచ్చిబౌలిలోని ప్రైమ్ లొకేషన్‌లో 400 ఎకరాల స్థలం ఉన్నందున కమర్షియల్, రెసిడెన్షియల్, పబ్లిక్ యుటిలిటీస్, స్కై వే, కల్చరల్ ఈకో పార్కులు, గ్రీన్ ఏరియా, లాండ్ స్కేపింగ్, సైక్లింగ్ ట్రయల్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్… ఏ రూపంలో డెవలప్ చేస్తే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో స్టడీ చేసి రిపోర్టులో పేర్కొనాలని టెండర్ డాక్యుమెంట్‌లో టీజీఐఐసీ పేర్కొన్నది. ఏ రంగానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందో అంచనా వేసి మార్కెట్ వ్యూహానికి తగినట్లుగా డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన సూచనలు చేయాలని పేర్కొన్నది. గత రెండు మూడేళ్లలో భూముల ధరలు ఎలా పెరిగాయి.. అద్దెల రూపంలో ఆఫీస్ స్పేస్, కమర్షియల్, రెసిడెన్షియల్ తదితరాలకు ఎలాంటి డిమాండ్ ఉన్నది.. వీటన్నింటినీ ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా అంచనా వేసి ప్రొజెక్షన్‌తో రిపోర్టులో తగిన సిఫారసులు చేయాలని పేర్కొన్నది. రెండు ప్రాథమిక కాన్సెప్ట్ నోట్‌లను, ఒక ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని నొక్కిచెప్పింది.
వేలం ద్వారా విక్రయాలు
లే ఔట్ మాస్టర్ ప్లాన్ తర్వాత వేలం ద్వారా విక్రయించాలనే లక్ష్యంలో మార్కెట్‌లో కొనుగోలుదారులెవరనే అంశంలో స్పష్టత ఉండాలని, దానికి తగినట్లుగానే మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించాలని టీజీఐఐసీ పేర్కొన్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో వేలంలో పాల్గొనడానికి ముందుకొచ్చేవాటిపై అంచనా ఉండాలని పేర్కొన్నది. ఇన్వెస్టర్లు, డెవలపర్లు.. ఇలా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారో, వారి ఆసక్తి ఎలా ఉన్నదో వివరాలను కూడా పొందుపర్చాలని పేర్కొన్నది. నేరుగా టీజీఐఐసీ వారితో చర్చలు జరిపేందుకు వీలుగా ఈ జాబితాను సమర్పించాలన్నది. అవసరమైతే వేలం సమయంలో ప్రీ-బిడ్ సమావేశాలు జరిపేందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చని పేర్కొన్నది. ఈ స్థలాన్ని లే ఔట్ ఛేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేసిన తర్వాత ఐదు దశల్లో వేలం వేయాలని టీజీఐఐసీ ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. ఈ మూడు ప్రక్రియలను సమర్ధవంతంగా చేయగిలిగిన సంస్థలను టెండర్ ప్రక్రియ ద్వారా టీజీఐఐసీ ఎంపిక చేయాలనుకుంటున్నది. అందులో భాగంగానే సుమారు పాతిక వేల కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల స్థలాన్ని పకడ్బందీగా మార్కెట్0 డిమాండ్‌కు తగినట్లుగా డెవలప్ చేసేందుకు అర్హతను ఖరారు చేసేందుకు నిర్దిష్టమైన నిబంధనలను రూపొందించింది. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అనుబంధ రంగాల్లో కనీసంగా ఇరవై సంవత్సరాల అభుభవం ఉండాలని, వార్షిక టర్నోవర్ వెయ్యి కోట్లకు తగ్గరాదని, గతంలో రూ. 400 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ టెండర్లలో అర్హత సాధించి ఉండాలని.. ఇలాంటి నిబంధనలను పెట్టింది. వాటి అర్హతలు, అనుభవానికి తగినట్లుగా మార్కుల క్రైటీరియాను కూడా ఫిక్స్ చేసింది. టెండర్ దక్కించుకున్న తర్వాత మూడు దశల రిపోర్టులను ఎంత సమయానికి ఇవ్వాల్సి ఉంటుందనేది కూడా టెండర్ నోటిఫికేషన్‌లో టీజీఐఐసీ నొక్కిచెప్పింది.