Telangana Formation Day: అమెరికాలో బీఆర్ఎస్ (BRS) తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డలాస్ (Dallas)లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ అవతరణతో పాటు బీఆర్ఎస్ రజతోత్సవం వేడుకలను సైతం కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ వేడుకలకు అమెరికా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Cadre).. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు (NRI) తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023లో తాము ఓడిపోయినా.. తెలంగాణను ప్రేమించడంలో చాలా ముందున్నట్లు స్పష్టం చేశారు.
దశాబ్దాలు కొట్లాడి సాధించాం
నాలుగు కోట్లమంది ప్రజల కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR).. తెలంగాణ కలగన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే ఒక్కరిగా బయల్దేరి.. ఎన్నో అవమానాలను అధిగమించారని పేర్కొన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలు.. దశాబ్దాల కొట్లాటతో తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము అధికారంలో లేకపోయినప్పటికీ తిరిగి మూడేళ్లలో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. అమెరికాలోని తెలంగాణ వాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయని భావించానని.. ఇక్కడికి వచ్చాక టెక్సాస్ తో కలిపి 3 ఉన్నాయని అర్థమైందని వ్యాఖ్యానించారు.
ఆర్థికాభివృద్ధిలో టాప్
2014 జూన్ 2న అసాధ్యమైనది సుసాధ్యం చేసిన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 60 ఏండ్ల కల నిజమైన రోజని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. అద్భుతమైన అక్షయపాత్రగా అవతరించిందని పేర్కొన్నారు. తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.3.56 లక్షలకు చేరిందని.. దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో నంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు. 8 ఏండ్లలోనే రాష్ట్రంలో 10 శాతం మేర పేదరిక నిర్మూల జరిగిందని కేటీఆర్ అన్నారు.
Also Read: Telangana Formation Day 2025: మన టార్గెట్ అదే.. మీ సహకారం కావాలి.. సీఎం రేవంత్ గూస్ బంప్స్ స్పీచ్!
కాళేశ్వరంపై దుష్ప్రచారం
తెలంగాణ నీటి అవసరాలు తీర్చేందుకు కేసీఆర్.. అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. తుంగతుర్తి, డోర్నకల్, మహబూబ్ సాగర్ కు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) కారణమని చెప్పారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం నిర్మించిన ఘటన కేసీఆర్ (KCR)కు దక్కుతుందన్నారు. 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy lift irrigation)లో 10 శాతం పనులు మిగిలిపోతే వాటిని ప్రస్తుత ప్రభుత్వం (Congress Govt) పూర్తి పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే మిగిలిన పనులను పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.