TG Endowments Department: ఎండోమెంట్ శాఖలో అధికారుల కొరత వేధిస్తోంది. ఏళ్లతరబడి శాఖలో పోస్టులు ఖాళీగా ఉండటంతో అబివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సైతం అందించినట్లు సమాచారం. అయితే భర్తీపై మాత్రం క్లారిటీ రాలేదు. ఉన్న అధికారులు, సిబ్బంది అదనపు భారం పడటంతో సతమవుతున్నారు.
ఈవోలపై అదనపు భారం
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ(Endowment Department)పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అయితే శాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలో 704 ప్రధానఆలయాలు ఉన్నాయి. ఆలయాలకు ప్రభుత్వం 1454 పోస్టులు మంజూరు ఇవ్వగా, అందులో 1043 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 233 మంది ఈవోలు ఉండాలి. కానీ, 164 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 69 మంది ఈవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవోలపై అదనపు భారం పడుతుంది. ఒక్కొక్కరికి 8 నుంచి 10 ఆలయాల వరకు బాధ్యతలు చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి 3లేదా 4 ఆలయాలు ఉంటే నిత్యం మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల వివరాలపై అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. అసలు ఆ శాఖలో మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు..? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయంలో అధికారుల్లో క్లారిటీ లేదు. ప్రభుత్వానికి పంపిన జాబితాకు, సంబంధిత శాఖ మంత్రికి పంపిన వివరాలకు మధ్య తేడాలున్నట్లు సమాచారం.
Also Read: Gadwal District: మగవాళ్లకు పౌష్టికాహారంపై అవగాహన అవసరం: కలెక్టర్ బి.ఎం సంతోష్
భూములను ఆక్రమణ
దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అత్యంత కీలకమైన భూముల విభాగం (ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్)లో మూడేండ్లుగా సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ సెక్షన్ వ్యవహారాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పటికే 20వేల ఎకరాలకు పైగా భూములు ఆక్రమణ గురయ్యాయి. ప్రభుత్వాలు, కమిషనర్లు మారినా.. ఈ సెక్షన్‌కు మాత్రం పర్మినెంట్సూపరింటెండెంట్ను నియమించడం లేదు. ప్రస్తుతం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నలుగురు తహసీల్దార్లు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ మానిటరింగ్ లేకపోవడంతో కోర్టు కేసుల విషయంలో, భూములను ఆక్రమణ దారుల నుంచి వెనక్కి తీసుకురావడంలోనూ జాప్యం జరుగుతుందనే విమర్శలున్నాయి. 2023 ఫిబ్రవరిలో అప్పటి సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ ఆరోగ్య రీత్యా మెడికల్ లీవ్ లో వెళ్లి పోయినప్పటి నుంచి రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియమించలేదు. ఆయన తిరిగి జాయిన్ అయినా.. అకౌంట్స్ సెక్షన్ కు మార్చారు. ఎలక్షన్ కు ముందు సీజీఎఫ్సెక్షన్ సూపరింటెండెంట్‌ను ఇన్ చార్జీగా ఇచ్చినా.. ఆయన మూడు నెలలు ఎలక్షన్ డ్యూటీ లోనే ఉన్నారు.
వేములవాడ లడ్డూ నాణ్యతా..
ఇది ఇలా ఉండగా ఆలయాల్లో సౌకర్యాలు కల్పన, అభివృద్ది పనులను పర్యవేక్షించాల్సిన ఈవోలు, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆలయాల్లో అరకొరగా ఉన్న సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. దర్శన టికెట్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి ప్రసాదాలు, లడ్డూలు, పులిహార, పొంగలి తదితర నైవేద్యాల తయారీలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా వేములవాడ లడ్డూ నాణ్యతా ప్రమాణాలపై తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాయడం, తనిఖీ చేయించిన విషయం తెలిసిందే. సిబ్బంది కొరత కారణంగానే ఉన్నఅధికారులపై అదనపు భారం పడుతుంది. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీలకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ.. నాటి ప్రభుత్వానికి నివేదించినా ఖాళీలు భర్తీ కి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
