TG Electricity News: కొత్తగా ఒక అపార్ట్ మెంట్ ను కట్టారు. దానికి కాపలాగా ఒక వాచ్ మెన్ ను పెట్టారు. ఆ వాచ్ మెన్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సూపర్ వైజర్ ను నియమించారు. వారందరినీ అబ్జర్వ్ చేసేందుకు ఒక మేనేజర్ ను నియమించారు. తీరా అంతమందిని పనిలోకి తీసుకున్నాక నిర్వహణ ఖర్చులు, జీతభత్యాల ఖర్చులు ఎక్కువై ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఆ వాచ్ మెన్ ను పనిలో నుంచి తొలగించి ఆర్థిక భారం తగ్గించుకున్నారు. ఇప్పుడు విద్యుత్ శాఖ తీరు కూడా ఇలాగే కనిపిస్తోంది.” పెరిగిన అధికారుల సంఖ్యతో విద్యుత్ శాఖ తల భారంగా, కాళ్లు సన్నగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఉన్న పోస్టుల కంటే..
తెలంగాణ విద్యుత్ రంగం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో పని చేసే చేతులు తగ్గుతుంటే, ఏసీ గదుల్లో పర్యవేక్షించే అధికారుల సంఖ్య మాత్రం అడ్డగోలుగా పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పోస్టుల కంటే స్వరాష్ట్రంలో కేవలం అధికారుల స్థాయి పోస్టులే అనూహ్యంగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖలో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ తో పాటు మరికొన్ని కీలక పోస్టులను అవసరానికి మించి సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర కాలంలో ఉన్న పోస్టుల సంఖ్యతో పోలిస్తే, ప్రస్తుతం తెలంగాణలో వీటి సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. పరిపాలన సౌలభ్యం పేరుతో భారీగా అధికారుల నియామకాలు చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ..
ఒకవైపు అధికారుల పోస్టులు పెరుగుతుంటే, మరోవైపు లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్, సబ్ స్టేషన్ల ఆపరేటర్లు, ఇతర గ్రౌండ్ లెవల్ సిబ్బంది సంఖ్య దారుణంగా పడిపోతోంది. గత కొన్నేళ్లుగా వరుస రిటైర్మెంట్లతో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ అయ్యాయి. కొత్త నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పనిభారం పెరుగుతోంది. దీంతో అత్యవసర సమయాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలుగుతోంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, అధికారుల పర్యవేక్షణ పెరిగిందని శాఖ గొప్పగా చెప్పుకుంటున్నా.. ఆచరణలో మాత్రం నష్టాలు తగ్గడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పర్యవేక్షణకే పరిమితమవుతోంది కానీ, విద్యుత్ చౌర్యం అరికట్టడంలోనో లేదా సరఫరా నష్టాలను తగ్గించడంలోనో ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
Also Read: Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. మాస్ రాజా క్రిస్మస్ అవతార్ చూశారా!
ఎస్పీడీసీఎల్ పరిధిలో..
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్ కోలో టెక్నికల్ సీఈ పోస్టులు 17, నాన్ టెక్నికల్ పోస్టులు 2 ఉండేవని తెలుస్తోంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ సంఖ్య పెరిగింది. సీఈ టెక్నికల్ పోస్టులు 21, నాన్ టెక్నికల్ పోస్టులు 4కు పెరిగినట్లు సమాచారం. అలాగే జెన్కోలో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ సీఈ పోస్టులు 13, నాన్ టెక్నికల్ సీఈ పోస్టులు 4 ఉన్నాయి. కాగా ప్రస్తుతం టెక్నికల్ సీఈ పోస్టులు 18, నాన్ టెక్నికల్ సీఈ పోస్టులు 5కు పెరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎస్పీడీసీఎల్ పరిధిలో గతంలో నాన్ టెక్నికల్ సీఈ పోస్టులు 8 ఉంటే, నాన్ టెక్నికల్ సీఈ పోస్టు 1 ఉంది. ప్రస్తుతం నాన్ టెక్నికల్ సీఈ పోస్టులు 14 ఉంటే, నాన్ టెక్నికల్ సీఈ పోస్టు 3గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఎన్పీడీసీఎల్ లో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ సీఈ పోస్టులు 4, నాన్ టెక్నికల్ పోస్టు 1 ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ప్రస్తుతం టెక్నికల్ సీఈ పోస్టులు 10, నాన్ టెక్నికల్ సీఈ పోస్టులు 2 ఉన్నట్లుగా తెలుస్తోంది.
కిందిస్థాయి సిబ్బంది..
అధికారుల సంఖ్య పెరగడం వల్ల వారి జీతభత్యాలు, వాహనాలు, ఇతర ఆఫీస్ ఖర్చుల రూపంలో కోట్లాది రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పెంచి, లైన్ మెయింటెనెన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యుత్ శాఖలో సీఈలుగా ఉన్న కొందరి వేతనం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎస్ ఈలు, డీఈల వేతనం కూడా లక్షల్లోనే ఉంది. అయితే అతికొద్ది వేతనం తీసుకునే కిందిస్థాయి సిబ్బంది విద్యుత్ శాఖకు అవసరం ఉన్నా అందుకు అనుగుణంగా మాత్రం అడుగులు ముందుకు పడటంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కత్త సబ్ స్టేషన్లనియామకం క్రమంగా పెరుగుతోంది. విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో దాన్ని తట్టుకునేందుకు మరిన్ని అవసరమని సర్కార్ నిర్మాణాలు చేపడుతోంది. కానీ కిందిస్థాయి సిబ్బందిని మాత్రం చేర్చుకునేందుకు ఆసక్తి కనబరచడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
పేరుకే పర్యవేక్షణ..
గతంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఆర్టీజన్లుగా మార్చారు. ఎప్పటినుంచో సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ వారి నుంచి వస్తున్నా ఏ సర్కార్ వారి గోడును పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 వేలకు పైగా ఆర్టీజన్ల సంఖ్య ఉండేది. కానీ ప్రతిఏటా రిటైర్ అవుతున్న వారితో క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 20 వేల వద్దకు చేరుకుంది. ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ స్థానంలో కొత్తవారు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. కానీ పైస్థాయి అధికారులు మాత్రం పేరుకే పర్యవేక్షణకు పరిమితమవుతున్నారనే విమర్వలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి శాస్త్రీయత విధానాలు పాటించకుండా నాలుగు గోడల మధ్య ఇష్టం వచ్చినట్లుగా పోస్టును క్రియేట్ చేసి వారికి కావాల్సిన వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ సర్కార్ అయినా కిందిస్థాయి సిబ్బంది నియామకం చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పైస్థాయి అధికారుల సంఖ్య కంటే కేవలం తెలంగాణలోనే అంతకంటే ఎక్కువ ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయినా సాంకేతిక పెరిగితే నష్టాలు తగ్గాలి. అలాగే పైస్థాయి అధికారుల పర్యవేక్షణ కూడా తగ్గుతుంది. కానీ పైస్థాయి అధికారుల పోస్టులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుని కిందిస్థాయి వారిని నియమించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయి సిబ్బంది కొరతను తీర్చి, అడ్డగోలుగా పెంచిన ఆఫీసర్ల పోస్టులపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read: Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

