తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Digital Media Spent: రాష్ట్ర ప్రభుత్వ పథకాల లాంచింగ్, అధికారిక కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రసారం చేసే ఉద్దేశంతో ఏర్పడిన తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం గడచిన పదేండ్లలో ఏం సాధించిందనే చర్చ జరుగుతున్న సమయంలో ఎనిమిదేండ్ల కాలంలో రూ.18.45 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడైంది. రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ విభాగానికి బీఆర్ఎస్ హయాంలో కొణతం దిలీప్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ముఖ్యమంత్రి, ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి అధికారిక కార్యక్రమాలను యూట్యూబ్, ట్విట్టర్(ఎక్స్), ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వెబ్ లైవ్ కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం ఈ విభాగం ప్రధాన డ్యూటీ. ఆ అవసరాల కోసం చేసిన ఖర్చు ఎంతనేది ఆ విభాగం వెల్లడించడానికి అప్పట్లో నిరాకరించింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాలతో ఎనిమిదేండ్ల కాలంలో రూ. 18.45 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విభాగం డైరెక్టర్‌గా ఉన్న కొణతం దిలీప్ ఆధ్వర్యంలో 2016 ఆగస్టు మొదలు 2023 వరకు ఏటేటా అవుతున్న ఖర్చు పెరిగింది.
తొలుత 2016లో రూ.32.72 లక్షలు ఖర్చు కాగా 2023 ఏప్రిల్-డిసెంబరు కాలంలో (తొమ్మిది నెలలు) రూ.13.85 కోట్లు ఖర్చయింది. కేవలం తొమ్మిది నెలల్లో ఇంత భారీ స్థాయిలో ఖర్చు కావడం చర్చనీయాంశమైంది. ఆ ఏడాది అక్టోబరు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిసెంబరు వరకూ ప్రభుత్వపరంగా అధికారిక కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడానికి ఆంక్షలు ఉన్నాయి. ఆ ఏడాది ఏప్రిల్ మొదలు అక్టోబరు వరకు(ఆరు నెలల కాలం) ఏకంగా రూ.13.85 కోట్లను ఏ అవసరాలకు ఖర్చు చేసిందనే అంశాన్ని ఇప్పుడు ఐటీ కమ్యూనికేషన్ల విభాగం ఇచ్చే వివరణతో స్పష్టత రానున్నది.
Also Read: Gaddam Shiva Prasad: హరితహారం కార్యక్రమంపై స్పీకర్ మాస్ ర్యాగింగ్.. దెబ్బకు బీఆర్ఎస్ సైలెంట్!
డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మైలేజ్ తెచ్చేలా కార్యక్రమాలను ప్రసారం చేసే సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అప్పటి ఐటీ మంత్రిగా కేటీఆర్‌ను ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ కొణతం దిలీప్ ఎక్కువ చొరవ తీసుకున్నారనే ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. వ్యక్తిగతంగా కేటీఆర్‌కు పాపులారిటీ తీసుకురావడం, ఆయనను హైలైట్ చేయడం, ఫాలోవర్స్ పెరిగేలా డైరెక్టర్ పనిచేశారన్నది ఆ ఆరోపణల ప్రధాన ఉద్దేశం. కేటీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట కొణతం దిలీప్ వెళ్ళినా ఆ ఖర్చులేవీ డిజిటల్ మీడియా విభాగం లెక్కల్లోకి రాలేదు.
ఐటీ కమ్యూనికేషన్ల విభాగం తరఫున అయ్యే ఖర్చుల ఖాతాల్లోకి వెళ్ళాయి. డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదాలో కొణతం దిలీప్ 2016 ఆగస్టు నుంచి 2023 మే నెల వరకు మొత్తం తొమ్మిది విదేశీ పర్యటనలు చేశారు. వీటికైన ఖర్చు మొత్తం ఐటీ విభాగం లెక్కల్లోకే వెళ్ళింది.
కొణతం దిలీప్ విదేశీ పర్యటనలు :
= 2015 మే, 2016 మే/జూన్, 2016 అక్టోబర్, 2017 మే, 2022 మార్చి నెలల్లో అమెరికా పర్యటన
= 2018, 2020 జనవరిలో, 2022 మే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్ సమ్మిట్‌కు హాజరు
= 2022 మే, 2023 మే నెలల్లో యూకే పర్యటన
= వీటికైన ఖర్చులన్నీ ఐటీ-కమ్యూనికేషన్ల డిపార్టుమెంటు లెక్కల్లోకి వెళ్ళాయి.
డిజిటల్ మీడియా చేసిన ఖర్చు :
= 2016 ఆగస్టు – 2017 మార్చి : రూ. 32,72,462
= 2017 ఏప్రిల్ – 2018 మార్చి : రూ. 51,99,429
= 2018 ఏప్రిల్ – 2019 మార్చి : రూ. 27,76,394
= 2019 ఏప్రిల్ – 2020 మార్చి : రూ. 50,35,646
= 2020 ఏప్రిల్ – 2021 మార్చి : రూ. 51,68,930
= 2021 ఏప్రిల్ – 2022 మార్చి : రూ. 94,93,980
= 2022 ఏప్రిల్ – 2023 మార్చి : రూ. 1,50,10,155
= 2023 ఏప్రిల్ – 2023 డిసెంబరు 3 : రూ. 13,85,50,524