– కాళేశ్వరం కమిషన్ లేఖపై స్పందించిన సీఎంవో
– అడిగిన సమాచారం ఇచ్చేందుకు సుముఖత
– ఈ నెల 30లోపు అంతా అప్పజెప్పాలని..
ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖలకు ఆదేశం
– రేపు క్యాబినెట్ భేటీలో కమిషన్ లేఖపై చర్చించే అవకాశం
– అధికారుల నిర్లక్ష్యంపై ఈ నెల 18న ‘స్వేచ్ఛ’ కథనం
– ‘బాధ్యత ఏది’ శీర్షికతో ప్రచురణ
– ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైన ‘స్వేచ్ఛ’ వార్త
– పదేళ్లలో 97 సార్లు క్యాబినెట్ సమావేశాలు
– కాళేశ్వరం అంచనాలు పెంచుకునేలా నిర్ణయాలు
– క్యాబినెట్‌లో చర్చ లేకుండానే కొన్ని అనుమతులు?
– నిజానిజాలు బయటపెట్టే పనిలో కమిషన్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ
Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది. ఈ మధ్యే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నివేదిక సమర్పించేందుకు అంతా సిద్ధమవుతున్నది. అయితే, తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు గత ప్రభుత్వ క్యాబినెట్ అంశాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అధికారులను కమిషన్ కోరింది. ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు లేఖలు రాసింది. ఈ విషయంపై అధికారులకు ‘బాధ్యత ఏది’ శీర్షికన ‘స్వేచ్ఛ’ కథనాన్ని ప్రచురించింది. కీలకమైన కాళేశ్వరం కమిషన్ విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రశ్నించింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కమిషన్‌కు వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో సీఎంవో వర్గాలు స్పందించాయి.
సంబంధిత శాఖలకు ఆదేశాలు
కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై శనివారం సీఎంవో రిప్లై ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ లోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారాన్ని ఇస్తాయని స్పష్టం చేసింది. కాళేశ్వరం కమిషన్ లేఖ ద్వారా అడిగిన సమాచారాన్ని ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖలకు పంపించినట్టు చెప్పింది. 30వ తేదీ లోపు అన్ని వివరాలను కమిషన్‌కు అందించాలని ఆదేశించింది. సోమవారం క్యాబినెట్ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ లేఖలపై చర్చించనున్నట్టు సమాచారం. అధికారుల తీరుపైనా మంత్రివర్గం మాట్లాడుకోవచ్చని తెలుస్తున్నది.
Read Also- Pawan Kalyan: మోదీ-పవన్ మధ్య గ్యాప్.. అంతా లోకేషే?
ఆనాడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అలాగే, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో 97 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. ఆయా సమావేశాల్లో కాళేశ్వరానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంచనాల పెంపు, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి ముందుకెళ్లారు. కొన్ని క్యాబినెట్‌లో చర్చించకుండానే అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని ఆ వివరాలను అందించాలని కమిషన్ కోరుతున్నది. అయితే, అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో మూడో సారి రాసిన లేఖలో కమిషన్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది.
ఇంకా మారని కొందరు అధికారులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. ఆ సమయంలో అన్ని కీలక శాఖల్లోని అధికారులు బీఆర్ఎస్ లీడర్లకు దగ్గరయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక సమాచారం ముందుగానే ప్రతిపక్షాల చేతికి చేరుతున్నదన్న అనుమానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పై అధికారులకు స్థాన చలనం కలిగించారు. అయితే, కిందిస్థాయి అధికారుల్లోనూ బీఆర్ఎస్ వేళ్లూనుకుపోవడంతో సమాచారం లీకేజ్ అవుతూనే ఉన్నది. ఇలాంటి సమయంలో కాళేశ్వరం కమిషన్ లేఖలు రాయడం, వాటికి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి.
Read Also- Mineral Water Plant Business: పుట్టగొడుగుల్లా పెరుగుతున్న వాటర్ ప్లాంట్లు.. పట్టించుకొని అధికారులు